నాన్న నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు! | dad is shooting for this movie once don't curse me! | Sakshi
Sakshi News home page

నాన్న నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు!

Published Fri, Jan 23 2015 12:14 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

నాన్న  నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు!

నాన్న నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు!

ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ దర్శకురాలిగా మారి, ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అనే చిత్రం చేశారు. గతంలో బుల్లితెరపై కొన్ని షోలు డెరైక్ట్ చేసిన అనుభవం శశికిరణ్‌కు ఉంది. భవిష్యత్తుపై తనకు స్పష్టమైన లక్ష్యం ఉంది. శశికిరణ్‌తో జరిపిన చిట్ చాట్.
 
 అసలు మీ కెరీర్ ఎలా ఆరంభమైంది?

 ముందు గ్రాఫిక్స్ విభాగంలో చేశాను. కానీ, ఒకేచోట కూర్చునే ఉద్యోగం అంటే నావల్ల కాలేదు. వేరే ఏదైనా చేద్దామనుకుని, టీవీకి సంబంధించిన డెరైక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. పలు టీవీ షోస్‌కి డెరైక్షన్ చేశాను. మాటీవీలో చేస్తూనే ఈ సినిమా డెరైక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నమ్మకం కుదిరి ఉద్యోగానికి రాజీనామా చేసేశా.

‘సాహెబా సుబ్రహ్మణ్యం’కి ఎలా అవకాశం వచ్చింది?

 యూఎస్‌లో ఉన్న కొల్లా నాగేశ్వరరావుగారికి నా గురించి ఫ్రెండ్ చెప్పారు. డెరైక్షన్ చేసే ప్రతిభ నాకుందని నా ఫ్రెండ్ చెప్పడంవల్లే నాగేశ్వరరావుగారు నన్ను సంప్రదించారు. మలయాళ సినిమా ‘తట్టత్తు మరియత్తు’ని రీమేక్ చేద్దామని ఆయనే అన్నారు. నాక్కూడా డెరైక్షన్ చేయగలననే నమ్మకం ఉండటంతో అంగీకరించాను.

టీవీపరంగా అనుభవం సంపాదించుకున్నా.. సినిమాలపరంగా దర్శకత్వ శాఖలో అనుభవం లేదు కదా.. ఏమైనా ఇబ్బంది అనిపించిందా?

 ఎక్కడా చేయకపోవడమే మంచిదనిపించింది. ఎవరి దగ్గరైనా పని చేసి ఉంటే, వాళ్ల ప్రభావం నా మీద ఉండి ఉండేది. ఇప్పుడు నా ఆలోచనలు, నా పని తీరు.. ఇవే సినిమాలో ప్రతిబింబిస్తాయి.మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాకి రీమేక్ ఇది.

ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ కాబట్టి, ‘సేఫ్’ అనుకున్నారా?

అలా ఏం కాదు. ఎందుకంటే, మలయాళ సినిమా అక్కడి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు సినిమాని ఇక్కడి నేపథ్యంలో, ఇక్కడివారి అభిరుచులకు తగ్గట్టుగా తీయాలి. మన నేటివిటీకి తగ్గట్టుగా కథాంశాన్ని మలచకపోతే అనువాద చిత్రంలా అనిపించే ప్రమాదం ఉంది. స్ట్రయిట్ సినిమా చేసినప్పుడు ఉన్న వెసులుబాటు రీమేక్ సినిమాకి ఉండదు. నేను ‘కట్ అండ్ పేస్ట్’లా ఈ సినిమా తీయలేదు. రీమేక్ అస్సలు సులువు కాదు.

సినిమా పరిశ్రమలో పురుషాధ్యికత ఉంటుందని, స్త్రీలంటే చిన్న చూపు ఉంటుందనే అభిప్రాయం ఉంది.. అదెంతవరకు నిజం?

 మేల్ డామినేషన్ నిజమేనండి. మొదట్లో ‘ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే’ అని తేలికగానే అనుకున్నారు. నా పనితీరు చూసిన తర్వాత గౌరవించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒకటేనండి.. నెమ్మదిగా చెప్పేవాళ్లకి నెమ్మదిగా.. కటువుగా చెప్పేవాళ్లకి ఆ విధంగా చెప్పాలి. ఆ లక్షణాలుంటే ఏ రంగంలోనైనా స్త్రీలు రాణించగలుగుతారు. మా నాన్నగారికి పరిశ్రమలో మంచి పేరుండటం హెల్ప్ అయ్యింది. ‘ఎమ్మెస్ నారాయణగారి అమ్మాయి’ అంటూ గౌరవ భావం, అభిమానంతో చూశారు.

డెరైక్టర్ అవుతానని చెప్పగానే మీ నాన్నగారు ఏమన్నారు?

 సినిమా పరిశ్రమలో లేడీస్ ఇమడటం సులువు కాదన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభించక ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాను. అప్పుడే నాన్నగారికి నా మీద నమ్మకం కుదిరింది. నాన్నగారెప్పుడూ ‘సున్నాతో మొదలు కావాలి’ అంటారు. షాట్ డివిజన్ ఎలా చేయాలి? సీన్స్ ఎలా రాసుకోవాలి? అని నా అంతట నేను నేర్చుకుని, సున్నాతోనే మొదలుపెట్టాను.

ఈ సినిమాలో మీ నాన్నగారు కూడా నటించారు కదా.. ఆయన్ను డెరైక్ట్ చేయడం ఎలా అనిపించింది?

చాలా భయం అనిపించింది. సరిగ్గా చేయకపోతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా, తిట్టేస్తారు. ఈ సినిమా షూటింగ్‌లో నన్ను ఒక్క రోజు కూడా తిట్టలేదు. సో.. బాగా చేశాననే అనుకుంటున్నా.

దర్శుకుల్లో మీకెవరు ఆదర్శం?

 అందరూ ఆదర్శమేనండి. అయితే కె. విశ్వనాథ్‌గారు, బాలు మహేంద్రగారు, మణిరత్నంగార్ల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. మహిళా దర్శకులందరూ ఆదర్శమే. మీరా నాయర్ చేసే సినిమాలంటే ఇష్టం. ’ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘క్వీన్’లాంటి సినిమాలు చేయాలని ఉంది.

డెరైక్షన్ కొనసాగిస్తారా?

 కచ్చితంగా. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేసుకున్నా. అవకాశాలు వస్తున్నాయి. నాన్నగారి దగ్గర అద్భుతమైన కథలున్నాయి. వాటిల్లో ఓ కథను ఎప్పటికైనా తెరకెక్కిస్తాను.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement