‘ఓటు’పై పాఠం...
- పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం
- కమిటీని నియమించిన సాధారణ పరిపాలన శాఖ
సాక్షి, హైదరాబాద్ : ఓటు హక్కు, వినియోగంతో పాటు ఓటుకు సంబంధించి విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే అవగాహన కలిగించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఎలక్టోరల్ లిటరసీ’ని పాఠ్యాంశంగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. కళాశాలల్లోనూ దీనిని ప్రవేశపెడతారు. దీనికోసం వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ బుధవారం జీఓ విడుదల చేసింది.
ఈ కమిటీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చైర్మన్‌గా, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, డెరైక్టర్, ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి, ఎన్సీఈఆర్టీ డెరైక్టర్, అకడమిక్ నిపుణులు సభ్యులుగా ఉంటారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీల్లో ఉన్న పౌర, సాంఘిక శాస్త్రంలోని అంశాలను పరిశీలించి ఎలక్టోరల్ లిటరసీని ఏవిధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలో సూచనలను కమిటీ మూడునెలల్లో నివేదిక రూపంలో అందించనుంది.