
మద్యం దుకాణాలు బంద్
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి మూసివేశారు. పోలింగ్ రోజు (ఫిబ్రవరి 2)న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆబ్కారీశాఖ ఆదేశాలిచ్చింది. దీంతో నగరంలోని బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేశారు. అదే విధంగా ఓట్ల కౌంటింగ్ రోజు (ఫిబ్రవరి 5)న కూడా సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
2న సినీ కార్మికులకు సెలవు
బంజారాహిల్స్: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 2న సినీ కార్మికులకు సెలవు ప్రకటించినట్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమాఖ్య, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ ఆదివారం తెలిపారు. సమాఖ్య 24 అనుబంధ సంఘాల కార్మికులంతా ఈ ఎన్నికల్లో పాల్గొని తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ రోజు సినిమా షూటింగ్‌లు కూడా బంద్ చేశామని పేర్కొన్నారు.