
సుపరిపాలనకే పట్టం కట్టండి
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
చైతన్యపురి: ప్రజాసమస్యల పరిష్కారానికి కనీసం కాల్‌సెంటర్ కూడా ఏర్పాటు చేయలేని శక్తిహీనులు మన పాలకులని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అలాంటి వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, సుపరిపాలనను అందించే వారికే పట్టం కట్టాలని యువతకు పిలుపునిచ్చారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అధికారాలు లేకుండా మేయర్ పదవిని ఉత్సవ విగ్రహంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాయకులు డబ్బు, కులంతో జనాలను శాసిస్తున్నారు. ఎన్నికలు రాజకీయ నాయకుల కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయో తప్ప, పన్నులు కట్టే ప్రజలకు కాదు. నాయకులు రాజకీయాన్ని ఓ వ్యాపారంలా చూస్తూ, ఏ పార్టీలో లాభముంటే అక్కడికి వలస పోతున్నారన్నా’రు. తాము గెలుపు కోసం బరిలోకి దిగలేదని, నిర్దిష్టమైన అజెండా కోసం లోక్‌సత్తా ఎన్నికల్లో పోటీ చేస్తోందన్నారు.