
ఇక ఆన్‌లైన్‌లో బస్ పాసులు
- జూన్ నుంచి అమలుకు ఆర్టీసీ సన్నాహాలు
- కౌంటర్ల వద్ద తగ్గనున్న రద్దీ
సాక్షి, హైదరాబాద్: బస్ పాస్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొనే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ దిశగా గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు బస్ పాస్‌ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జూన్ నుంచి ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఇందుకోసం ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది బస్ పాస్‌ల రెన్యువల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. కొత్తగా బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకొనేవాళ్లు మాత్రం బస్‌పాస్ కేంద్రాల వద్దకు వెళ్లవలసి ఉంటుంది.
ఒకసారి బస్ పాస్ తీసుకున్నవాళ్లు మిగతా 11 నెలల పాటు ఆన్‌లైన్‌లోనే రెన్యువల్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజుల్లో రెన్యువల్ కార్డులు వినియోగదారుల ఇళ్లకు చేరేవిధంగా కొరియర్‌లో అందజేస్తారు. ఈ సందర్భంగా కొరియర్ చార్జీలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. కాగా కొత్త విధానంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు 5 లక్షల మంది బస్‌పాస్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
రద్దీ నియంత్రణకు పరిష్కారం
ప్రతి సంవత్సరం బస్ పాస్ కేంద్రాల వద్ద రద్దీ, విద్యార్థుల ఇబ్బందులు, సకాలంలో పాస్‌లు లభించకపోవడం వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ‘సాక్షి’తో చెప్పారు. గ్రేటర్‌లో మొత్తం 2.50 లక్షల విద్యార్థుల బస్ పాస్‌లు ఉన్నాయి. వీటిలో 50 వేల ఉచిత బస్‌పాస్‌లు మినహాయిస్తే లక్షా 50 వేల జనరల్ బస్ టికెట్ (జీబీటీ)లు, మరో 50 వేల రూట్ పాస్‌లు ఉన్నాయి. ఈ ఏడాది మరో పాతిక వేల బస్ పాస్‌లు కొత్తగా పెరిగే అవకాశం ఉంది. ఇవికాకుండా సాధారణ ప్రయాణికులు 2.5 లక్షల మంది బస్‌పాస్‌లను వినియోగించుకుంటున్నారు. నగరంలోని 50 ఆర్టీసీ బస్ పాస్ కేంద్రాల ద్వారా పాస్‌లను అందజేస్తున్నారు. అయినప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. రెన్యువల్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించడం వల్ల ఈ కేంద్రాల వద్ద చాలావరకు రద్దీ తగ్గిపోతుంది. కేవలం కొత్తగా తీసుకొనేవాళ్లు మాత్రమే బస్ పాస్ కేంద్రాలకు వెళ్తారు.