
ఇక ఎన్నికలకు దూరం
‘లోక్‌సత్తా 2.0’గా కొత్త అవతారం: జేపీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ సంస్థగా, పార్టీగా రాజకీయాలలో వచ్చిన మార్పులు, ప్రజల ఆలోచనా తీరుకు అనుగుణంగా కొత్త తీరుతో, సవరించిన ఎజెండాతో పోరాడాలని నిర్ణయించినట్లు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. మూడు కీలకాంశాల సాధనకు కార్యాచరణ రూపొందించుకొని ‘లోక్‌సత్తా 2.0’ పేరిట ముందుకెళ్లనున్నట్లు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో జేపీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీలకు అతీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మూడు కీలకాంశాలపై తక్షణ కార్యాచరణను చేపట్టనున్నామన్నారు.
మొదటి అంశంగా ఫెడరలిజాన్ని పునర్నిర్వచించి... కేంద్రం అధికారాలు, దేశ సమగ్రతకు భంగం కలగకుండా రాష్ట్రాలకు పూర్తి స్వీయనిర్ణయాధికారాలనిచ్చి ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించే వెసులుబాటు ఇవ్వటమని జేపీ తెలిపారు. ఉత్తమ ప్రమాణాలతో విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం రెండో అంశమన్నారు. స్థానిక ప్రభుత్వం, పౌరులకు పూర్తి బాధ్యతలు, పన్నుల్లో వాటా అందించి స్థానిక సమస్యల పరిష్కారం, విధానాల అమల్లో వారిని పూర్తి భాగస్వాములను చేయడం మూడవ అంశమన్నారు.