ప్చ్....చార్జీలు పెంచినా...
⇒ ఆర్టీసీని వెంటాడుతున్న నష్టాలు
⇒ గతేడాది జూన్‌లో చార్జీలు పెంచినా మారని పరిస్థితి
⇒ జనవరి నాటికి రూ.506.67 కోట్లుగా నమోదు
సాక్షి, హైదరాబాద్: నష్టాల నుంచి కొద్దోగొప్పో గట్టేందుకంటూ గతేడాది ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినా పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా జనవరి నెల నష్టాలు చూసి అధికారులే నివ్వెరపోవాల్సి వచ్చింది. ఆ ఒక్క నెలలోనే ఏకంగా రూ.67.89 కోట్ల నష్టాలు నమోదైనట్టు తేలింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి నష్టాల మొత్తం రూ.506.67 కోట్లకు చేరింది.
గతేడాది జనవరి నెలలో నష్టాలు రూ.41.53 కోట్లు నమోదుకాగా, ఈసారి రూ.26 కోట్ల మేర అదనంగా నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈసారి నష్టాలు ఎక్కువే ఉంటాయని ముందస్తు అంచనాకొచ్చిన ఆర్టీసీ యాజమాన్యం.. అవి రూ.900 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలల నష్టాలు మాత్రమే జోడించాల్సిన తరుణంలో.. ఆ మొత్తం రూ.506 కోట్ల వద్దే ఉండటం కాస్త ఊరట కలిగిస్తోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ మొత్తానికి మరో రూ.100 కోట్ల వరకు నష్టాలు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆదాయం ఎటు పోతోంది..?
గతేడాది జూన్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలను స్వల్పంగా పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో 5 శాతం, ఇతర కేటగిరీ బస్సుల్లో 10 శాతం పెంచింది. ఈ రూపంలో వార్షికంగా రూ.286 కోట్ల మేర అదనపు ఆదాయం నమోదవుతుందని ప్రకటించింది. ఆ ప్రకారం నష్టాలు తగ్గాలి. గతేడాది జనవరి నాటికి రూ.545.87 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. జూన్ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చినందున.. ఆరు నెలల కాలానికి కనీసం రూ.145 కోట్లు అదనపు ఆదాయం రావాల్సి ఉంది.
ఆ లెక్కన ఈ ఏడాది జనవరి నాటికి నష్టాలు రూ.400 కోట్ల వద్దే ఆగిపోవాల్సి ఉన్నా.. రూ.506 కోట్లకు చేరుకున్నాయి. ఉద్యోగులకు వేతన సవరణ జరిగినందున వాటి పెండింగ్ బకాయిలను చెల్లిస్తుం డటంతో కొత్త చార్జీల ద్వారా రావాల్సిన ఆదాయం కనిపించటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వేతన బకాయిలకు గాను ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక విడత మాత్రమే చెల్లించారు. అది కూడా రూ.80 కోట్లకే పరిమితమైంది. ఆ మొత్తాన్ని కలిపి చూసినా మరో రూ.60 కోట్ల అదనపు ఆదాయం ఉంటుంది. అదీ కనిపించటం లేదు.