- ఆఫ్రికా సింహం పుట్టిన రోజు నిర్వహించిన అధికారులు
బహదూర్‌పురా
నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆఫ్రికా సింహం మాధవ్ 4వ జన్మదినోత్సవ వేడుకలను జూపార్కులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సౌదీ నుంచి మూడేళ్ల క్రితం హైదారబాద్ కి వచ్చిన ఈ సింహానికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. సాక్షాత్తు సౌది యువరాజు మాధవ్ ను నెహ్రూ జూపార్క్ కు బహుమానంగా ఇచ్చారు. 2012 అక్టోబర్ లో నగరంలో జరిగిన కాప్ - 11 సందర్భంగా యువరాజు బందర్ బిన్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సౌద్ జూపార్క్ సందర్శించారు.
సహజ వాతావరణంలో.. విశాలంగా ఉన్న జంతుప్రదర్శన శాలను చూసి... ఆనందం వ్యక్తం చేసిన యువరాజు.. తన వద్ద ఉన్న ఆఫ్రికా సింహాలు, చీతాలకు ఇది అనువైన ప్రదేశం అని నిర్ణయించి.. వాటిని బహుమతిగా అందించారు. అలా మాధవ్ 2013లో అరబ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. నాలుగేళ్ల వయస్సున్న ఈ సింహం పుట్టిన రోజు సందర్భంగా జూ అసిస్టెంట్ క్యూరేటర్లు సరస్వతీ శ్రీదేవి, మురళీధర్, లక్ష్మణ్, బయోలజిస్ట్ సందీప్, జూపార్కు పీఆర్‌ఓ హనీఫ్, యానిమల్ కీపర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు.