సీఎస్‌గా పొడిగించిన కేంద్రం
తొలుత సీఎస్‌గా ఐవైఆర్ నియామకానికి ఫైలు రెడీ
ఐవైఆర్‌కు అభినందనలు తెలిపిన దిగ్విజయ్, కేవీపీ, రఘువీరా
రాష్ట్రపతి పాలన నిర్ణయంతో చక్రం తిప్పిన మహంతి
రంగంలోకి మాంటెక్ సింగ్ అహ్లువాలియా, జైరాం రమేశ్
దీంతో ఐవైఆర్‌కు మొండిచేయి... మహంతికి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒక్కరోజు కూడా కొనసాగనని, పదవీకాలం పొడిగింపు కోరబోనని పేర్కొన్న ప్రసన్నకుమార్ మహంతి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. మరో ముఖ్యమంత్రిని నియమిస్తే పదవీకాలం పొడిగింపును కోరకూడదని, రాష్ట్రపతి పాలన విధిస్తే సీఎస్‌గా కొనసాగాలనేది మహంతి అభిప్రాయం. అయితే శుక్రవారం రాత్రి రాష్ట్రపతి పాలన విధిస్తున్నారని తెలియడంతో సీఎస్ మహంతి ఒక్కసారిగా పావులు కదిపి పొడిగింపు సాధించారు.
వాస్తవానికి కొత్త సీఎస్ ఎంపిక కోసం ఫైలును శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌కు పంపించారు. కొత్త సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు నియామకానికి కేంద్ర అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ స్వయంగా ఐ.వై.ఆర్.కు ఫోన్ చేసి అభినందించారు. అలాగే కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శ్రీధర్‌బాబు ఫోన్ ద్వారా ఐవైఆర్‌కు అభినందనలు తెలిపారు.
కానీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని తెలియడంతో సీఎస్‌గా తానే కొనసాగేందుకు మహంతి రాత్రికి రాత్రి పావులు కదిపారు. తనకు సన్నిహితుడైన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను గురువారం రాత్రి రంగంలోకి దింపారు.
ఇప్పటివరకు రాష్ట్ర విభజన అంశాలను స్వయంగా మహంతి చూసినందున కంటిన్యుటీ లేకపోతే విభజన సమయంలో చిక్కులు వస్తాయని, అలాగే విభజన సమయంలో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి సీఎస్‌గా ఉండటమే మంచిదంటూ అహ్లువాలియా ప్రధాన మంత్రి కార్యాలయంలోని పులోక్ చటర్జీతో మాట్లాడారు.
దీంతో ప్రధాన మంత్రి కార్యాలయం సీఎస్‌గా మహంతిని కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా రాష్ట్ర పర్యటనలో ఉన్న జైరాం రమేశ్‌తో అహ్లువాలియా మాట్లాడి గవర్నర్ నరసింహన్ దగ్గరకు పంపించి సీఎస్‌గా మహంతి కొనసాగింపునకు అవసరమైన కారణాలను వివరింపచేశారు.
ఫలితంగా ఐవైఆర్ నియామకానికి బ్రేక్ పడింది. సీఎస్‌గా మహంతి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కూడా సీఎస్‌గా మహంతి 4 నెలలు కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేసింది.
మరో 4 నెలలు మహంతి
Published Sat, Mar 1 2014 1:54 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement