
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవాలకు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జరిగిన స్నాతకోత్సవంలో 270 మంది విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను అందజేశారు. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన 680 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ...విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులు, ఆచార్యులను విస్మరించరాదని హితవు పలికారు. విశ్వవిద్యాలయంలో విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నారు. మానవత్వమే ప్రతి ఒక్కరి జీవన విధానంగా మారాలని పేర్కొన్న గవర్నర్... సమాజం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా విద్యావిధానం ఎదగాలన్నారు. ఓయూ.. భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అని కొనియాడారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు యూనివర్సిటీ గౌరవాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల వైస్‌చాన్స్‌లర్ ప్రొ. రామచంద్రం, ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment