హైదరాబాద్లో గజినీ ! | man arrested on hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో గజినీ !

Published Thu, Aug 28 2014 2:46 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

హైదరాబాద్లో గజినీ ! - Sakshi

హైదరాబాద్లో గజినీ !

హీరో సూర్య చిత్రం గజినీ గుర్తుండే ఉంటుంది. తాజాగా హైదరాబాద్లో కూడా అలాంటి ఓ అభినవ గజినీ హల్చల్ చేశారు. వారం క్రితం పుణె నుంచి ఓ యువకుడు నగరానికి వచ్చాడు. స్టార్ హోటళ్లలో బస చేశాడు.. గుండెపోటంటూ హడావుడి చేసి అపోలో ఆస్పత్రిలో చేరాడు. ఖరీదైన వైద్యం పొందాడు. తీరా బిల్లు చెల్లించమంటే ‘నేనెవరు?... నన్నెవరు తీసుకొచ్చారు' అంటూ రివర్స్ తిరిగాడు. విస్తుపోయిన ఆస్పత్రి వర్గాలు ఈ గజనీని పోలీసులకు అప్పగించారు.

గుండెపోటు వచ్చిందంటూ పుణెకు చెందిన ఓ యువకుడు అపోలో ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. చూసేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లాగా కనిపించడమే కాకుండా ఇంగ్లిష్‌లో అదరగొట్టాడు. అతగాడి డాబూ దర్పం చూసిన అపోలో వైద్యులు సకల మర్యాదలతో పాటు చికిత్స అందించారు. ఖరీదైన మందులిచ్చారు. రెండు రోజులు డీలక్స్ రూమ్‌లో సపర్యలు చేశారు. డిశ్చార్జ్ చేసే ముందు రూ. 29 వేల బిల్లు ను చేతిలో పెట్టారు. బిల్లు నాకెందుకిస్తున్నారని, అసలు నన్నిక్కడికి ఎవరు తీసుకువచ్చారంటూ యువకుడు ఎదురు ప్రశ్నించేసరికి ఆస్ప త్రి వర్గాలు నోరెల్లబెట్టాయి. ఆ యువకుడికి మతిస్థిమితం సరిగా లేదని భావించి..  ఆస్పత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ జగదీష్ సింగ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అతని పేరు సామ్రాట్ గుప్తా (35), స్వస్థలం పుణెగా గుర్తించారు. ఎంకామ్ చదివినట్టు అతని వద్ద లభించిన ధ్రువపత్రాల ద్వారా తెలిసింది. వారం కిందట సామ్రాట్ వైశ్రాయ్ హోటల్‌లో నాలుగు రోజులు బస చేసి బిల్లు చేతిలో పెట్టేసరికి తాను ఇక్కడ ఉండనేలేదని, ఎందుకు బిల్లు కట్టాలంటూ ప్రశ్నించి తప్పుకున్నాడు. బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ ఇలాగే టోకరా ఇచ్చినట్లు తేలింది.

 నగరంలోనూ ఇదే ధోరణితో పలువురిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో మానసిక చికిత్సాలయం లో చేర్చి మానసిక స్థితిని తెలుసుకోవాలని నిర్ణయించారు. సామ్రాట్‌కు నిజంగానే మతి తప్పిందా? లేక ఇదంతా బిల్లులు ఎగగొట్టడానికి చేస్తున్న నాటకమా? అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement