
డబ్బు ఇవ్వలేదని ప్రియురాలి కూతురి హత్య
హైదరాబాద్ : అడిగినంత డబ్బు ఇవ్వలేదని ప్రియురాలి కూతురిని చంపేశాడో కిరాతకుడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన సయ్యద్ ఆరీఫ్ అలియాస్ బాబు (25) హఫీజ్‌బాబానగర్‌లోని అల్తాఫ్ యూనాని క్లినిక్‌లో పని చేసేవాడు. ఈ క్రమంలో ఇతనికి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ హోటళ్లలో పని చేస్తున్న కవిత పరిచయమైంది. ఈమె భర్త మద్యానికి బానిస కావడంతో ఐదేళ్ల క్రితం వదిలేసింది. వీరికి కూతురు పుష్ప(10) ఉంది.
కాగా కవిత, ఆరీఫ్‌తో కలిసి రెడ్డిబస్తీలో మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది. ఆరీఫ్ కూడా తాగుడుకు బానిసకావడంతో పని మానేసి ఖాళీగా ఉంటున్నాడు. రోజూ పూటుగా తాగి వచ్చి డబ్బుల కోసం కవితను కొట్టడం మొదలు పెట్టాడు. ఈనెల 15న రాత్రి పీకలదాక మద్యం తాగి ఇంటికి వచ్చి కవితను చితకబాదాడు. ఇతని వేధింపులు భరించలేక కవిత మరుసటి రోజు రంగారెడ్డిజిల్లాలోని తన పుట్టింటికి వెళ్లింది. ఎప్పటిలాగే కూతురు పుష్పను ఇక్కడే వదిలి వెళ్లింది. ఆరీఫ్ రోజూ పుట్టింటిలో ఉన్న కవితకు ఫోన్ చేసి డబ్బులు తెమ్మని, లేకపోతే నీ కూతుర్ని చంపుతానని బెదిరించాడు.
ఈ క్రమంలో అన్నంత పని చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పుష్పను మెడకు చున్నీతో ఉరి వేసి చంపేశాడు. కవిత సైదాబాద్‌కు వచ్చి ఆరీఫ్‌కు రూ. 700 ఇచ్చి మళ్లీ పుట్టింటికి వెళ్తుండగా.. నీ కూతురిని చంపేశానని, ఇంటికి వెళ్లి చూడమని ఫోన్ చేసి చెప్పాడు. అయినా కవిత అతని మాటలు నమ్మలేదు. దీంతో అతడు నేరుగా సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. పోలీసులు కవితకు ఫోన్ చేసి నీ కూతురు చనిపోయిందని చెప్పగా.. ఆమె ఇంటికి వచ్చి విగతజీవురాలై పడి ఉన్న కూతుర్ని చూసి బోరుమంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.