రిజిస్ట్రార్ పుస్తెలతాడు స్నాచింగ్
హైదరాబాద్: వాకింగ్ చేస్తున్న ఓ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మెడలోని పుస్తెలతాడును బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తెంచుకొని పారిపోయారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కవితా దర్యానిరావు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు.
సోమవారం సాయంత్రం ఆమె ఎమ్మెల్యే కాలనీ నుంచి వాకింగ్ చేసుకుంటూ కేబీఆర్ పార్కు వైపు వెళ్తున్నారు. కాలనీలోని ఆంధ్రబ్యాంక్ సమీపంలోకి రాగానే నంబర్‌ప్లేట్ లేని బైక్‌పై హెల్మెట్లు ధరించి ఇద్దరు దుండగులు ఎదురుగా వచ్చారు. ఒక్కసారిగా వారు కవిత మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాగారు. అప్రమత్తమైన ఆమె పుస్తెలతాడును గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగి కవిత కిందపడిపోయారు. ఇదే అదనుగా దుండగులు పుస్తెలతాడు పట్టుకొని పారిపోయారు.
ఈ ఘటనలో స్వల్పగాయాలకు గురైన బాధితురాలు కవితను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. వారం రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు స్నాచర్ల బారిన పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.