mangalsutra
-
Crime: తాళిబొట్టే గొంతు కోసింది
తాళిబొట్టే పాపం ఆమె పాలిట యమపాశం అయ్యింది. ఆమె గొంతు కోసి ప్రాణం తీసింది. ఢిల్లీ గాంధీనగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. బీహార్ మధుబనికి చెందిన అనిల్ పాశ్వాన్, భార్యా రాధాదేవి కొడుకుతో పాటు గాంధీనగర్‌కు వలస వచ్చాడు. రఘుబీర్‌పురలో టైలర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రాధాదేవి మెట్ల మీద నుంచి జారిపడింది. ఈ క్రమంలో ఆమె తాళిబొట్టు మెడకు చుట్టుకుని కోసుకుపోయింది. ఆ గాయాలతోనే ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మెడ చుట్టూ గాయాలు చూసి పోలీసులు తొలుత ఈ కేసులో అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే నాలుగేళ్ల కొడుకు.. టెర్రెస్ మీద నుంచి తన తల్లి మెట్ల మీద నుంచి జారిపడడం, ఆ సమయంలోనే మెడలోని తాళి కోసుకుపోయి చనిపోవడం గురించి ఏడుస్తూ పోలీసులకు వివరించాడు. ఆ సమయంలో భర్త కూడా దుకాణంలో ఉండడాన్ని నిర్ధారించుకుని.. ఈ కేసును ప్రమాదంగానే నమోదు చేసుకున్నారు. -
మంగళసూత్రం గురించి తెలిపిన ప్రియాంక.. అది ప్రత్యేకమైన క్షణం
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత హాలీవుడ్లో అడుగు పెట్టి అందరి మన్ననలు పొందుతోంది. పలు చిత్రాల్లో నటించి హాలీవుడ్లో సైతం మంచి పాపులారిటీని దక్కించుకుంది. అనంతరం 2018లో రాజస్థాన్‌లో పాప్ సింగర్, నటుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. అయితే తాను ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తుకి ఎదిగినా తనతోపాటే ఇండియా, భారతదేశ సంస్కృతి ఉంటుందని ఇటీవల చెప్పుకొచ్చింది ప్రియాంక. తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఏ ఒక్కరూ తక్కువ చేయకుండా ఎప్పటికప్పుడూ ఎదుగుతూ ముందుకు సాగుతోంది. (చదవండి: ప్రియాంక చోప్రా అరుదైన ఘనత.. 30కిపైగా) అయితే తాజాగా ప్రియాంక తాను మొదటి సారి మంగళ సూత్రం ధరించినప్పుడు కలిగిన అనుభూతిని చెప్పుకొచ్చింది. ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా మంగళసూత్రం విలువ గురించి తెలిపింది. 'నేను మంగళ సూత్రం మొదటి సారి ధరించడం నాకు గుర్తుంది. ఎందుకంటే దాని విలువ ఏంటో, దాని అర్థం ఏంటో చెబుతూ నన్ను పెంచారు. అది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం. ఒక ఆధునిక మహిళగా, దాని ధరించడం వల్ల వచ్చే పరిణామాలను కూడా నేను అర్థం చేసుకున్నాను. మంగళ సూత్రాన్ని నల్లని పూసలతో చేసేవారు. చెడును దూరం చేసి, మిమ్మల్ని రక్షించడానికి నలుపు చిహ్నంగా ఉంటుంది. మంగళ సూత్రం ధరించడం నాకు ఇష్టమా కాదా, అది పితృస్వామ్య వ్యవస్థకి నిదర్శనమా అనేది నాకు తెలియదు. ఈ వాదనలో నేను మధ్యలో ఉంటాను. సాంప్రదాయాన్ని గౌరవించి కొనసాగించండి. అలాగే మీరు ఎవరో, మీకు ఏం కావాలో తెలుసుకోండి. అందుకోసం నిలబడండి.' అంటూ తన మదిలోని భావాలను తెలిపింది ప్రియాంక. (చదవండి: ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు
తూప్రాన్: పెళ్లికి పురోహితుడిగా ఉండి వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టును దొంగగా మారి కొట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. అప్పటికి మంగళసూత్రం దొరక్క పసుపుతాడుతో పెళ్లి జరిపించేశారు. అంతా సద్దుమణిగాక పెళ్లి వీడియోలో ఈ పురోహితుడి ఘనకార్యం బయటపడింది. పడాలపల్లికి చెందిన మున్రాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్‌దాస్‌కు నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న తూప్రాన్‌లో గజ్వేల్‌కు చెందిన పురోహితుడు చరణ్‌శర్మ వివాహం జరిపించారు. అయితే పెళ్లి వేడుకలో వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టు ముహూర్తం సమయానికి కనిపించకపోవడంతో పసుపుతాడుతో పెళ్లి కానిచ్చేశారు. రూ.1.50 లక్షల విలువ చేసే 3 తులాల బంగారు మంగళసూత్రం ఏమైందన్న విషయాన్ని తెలుసుకునేందుకు పెళ్లిలో రికార్డయిన వీడియోను కుటుంబ సభ్యులు చూశారు. అందులో పురోహితుడే మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్న దృశ్యాలు కన్పించాయి. దీంతో బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
పోలీసులు.. ఓ తాళిబొట్టు: అసలు ఏం జరిగిందంటే?
సాక్షి బెంగళూరు: ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తాళలేక తన మాంగల్యాన్నే పణంగా పెట్టేందుకు ఓ మహిళ సిద్ధమైంది. ఈ ఘటన బెళగావిలో జరిగింది. హుక్కేరి తాలూకా హుల్లోళిహట్టి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ పోలీసుల అమానవీయతను గురించి మాట్లాడుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే..భారతి తన భర్తతో కలసి బైక్‌పై బెళగావి మార్కెట్‌కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో బస్టాండ్ వద్ద హెల్మెట్ లేదని పోలీసులు బైక్‌ను నిలిపేశారు. డాక్యుమెంట్లు పరిశీలించకుండానే నేరుగా జరిమానా విధిస్తూ రసీదు చేతికందించారు. అసలే మార్కెట్‌కు వెళ్లి డబ్బులు ఖాళీ చేసుకుని వెళుతున్న ఈ దంపతుల వద్ద కేవలం రూ.100 మాత్రమే ఉంది. జరిమానా కింద ఈ రూ.100 తీసుకుని వదిలేయండి అంటూ దంపతులు ప్రాధేయపడ్డారు. అయితే ఏమాత్రం కనికరించని పోలీసులు ఫైన్ కట్టి వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. పోలీసుల తీరుకు విసిగిపోయిన మహిళ తన మెడలో ఉన్న బంగారు తాళిని తీసి భర్త చేతికిచ్చి ఇది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురండి అని చెప్పింది. చివరికి అక్కడికి చేరుకున్న సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని దంపతులను వదిలేశారు చదవండి: భార్యను భయపెట్టాలని.. ఆసుపత్రి పాలై.. కిలేడీ.. మేకప్ వేసుకుంటే కనుక్కోలేం!.. -
ఒకవైపు భర్తకు పక్షవాతం.. మరొకవైపు ఆకలి కేకలు
భోపాల్: లాక్డౌన్ పుణ్యమా అని చిన్నచిన్న వ్యాపారాలు కుదేలయ్యాయి. అనేకమంది ఉపాధి కోల్పోవడంతో వారి జీవితాల్లో ఆకలి కేకలే కనబడుతున్నాయి. ఒకవైపు కరోనా.. మరొకవైపు ఆకలి చాలా మంది జీవితాలను ఛిద్రం చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ ఉపాధి కోల్పోవడంతో తినడానికి తిండి లేక, కుటుంబ పోషణ భారమై తన తాళిబొట్టునే అమ్మేసుకుంది. కౌశల్య పాటిల్ అనే మహిళ కుటుంబంతో కలిసి భోపాల్‌లోని విధాన సభ సెక్రటేరియట్‌కు సమీపంలోని మురికివాడలో జీవనం సాగిస్తోంది. ఆమె భర్త పక్షవాతంతో మంచాన పడటంతో కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంది. కానీ, కరోనా వల్ల ఆమె జీవితం తలకిందులైంది. దేవాలయాల్లో దర్శనాలు నిలిపివేయడంతో ఆలయం ముందు ప్రసాదాలు అమ్ముకునే తన వ్యాపారం ఆగిపోయింది. (కరోనా విలయం: విదారక ఘటన) ఈ క్రమంలో ఆదాయం లేక పూట గడవడమే గగనంగా మారింది. ఈ విషయం గురించి కౌశల్య పాటిల్ మాట్లాడుతూ.. "ఆలయాలు తెరవగానే భక్తులందరూ మళ్లీ గుళ్లబాట పడతారన్న నమ్మకముంది. అలా జరగకపోతే కరోనా కన్నా ముందు ఆకలే మమ్మల్ని చంపేసేలా ఉంది. అందుకే నా మంగళసూత్రాన్ని రూ.5 వేలకు అమ్మేసి కుటుంబానికి ఇంత భోజనం పెడుతున్నాను. నా కొడుకు ఓ పెట్రోల్ పంపులో పనిచేస్తున్నాడు. కానీ అతడికొచ్చే ఆదాయం ఇంటి అద్దెకే సరిపోతుంది" అని ఆమె దీనగాథను చెప్పుకొచ్చింది. (రియల్ హీరో అనిపించుకున్న కానిస్టేబుల్) చదవండి: ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం -
ఎద్దు కడుపులో బంగారు మంగళసూత్రం
ముంబై: ఓ ఎద్దు మహిళ మంగళసూత్రాన్ని మింగేసిన వింత సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాలు.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రతి ఏటా ఆగస్టులో ‘బెయిల్ పోలా’(ఎద్దుల పండుగ) పేరుతో ఓ పండుగ జరుగుతుంది. మన దగ్గర కనుమ నాడు ఏ విధంగానైతే ఎద్దులను అలంకరించి, పూజలు నిర్వహిస్తామో.. అలానే ఈ రాష్ట్రాల్లో కూడా బెయిల్ పోలా పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎద్దులను అలంకరించి.. వాటికి పూజలు చేసి.. ప్రత్యేకంగా చేసిన ప్రసాదం తినిపిస్తారు. అంతేకాక బంగారు ఆభరాణాన్ని ఎద్దు నుదురుకు తాకిస్తే మంచిదని నమ్ముతారు. ఈ క్రమంలో గత నెల 30న మహారాష్ట్రలోఈ బెయిల్ పోలా వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ రోజు సాయంత్రం ఓ రైతు తన ఎద్దులను అందంగా అలంకరించి పూజ నిమిత్తం ఇంటికి తీసుకువచ్చాడు. అతని భార్య ఓ పళ్లెంలో హరతి, ప్రసాదంతో పాటు తన బంగారు మంగళసూత్రాన్ని కూడా తీసుకుని వచ్చింది. ముందు ఎడ్లకు బొట్టు పెట్టి హారతి ఇచ్చింది. మంగళసూత్రాన్ని ఎద్దుల నుదురుకు తాకించి.. ప్రసాదం పెడదామని అనుకుంటుండగా ఉన్నట్టుండి కరెంట్ పోయింది. దాంతో లోపలికి వెళ్లి క్యాండిల్ తీసుకుని వచ్చి చూడగా.. ప్లేట్లో ఉంచిన ప్రసాదంతో పాటు.. బంగారు మంగళసూత్రం కూడా కనిపించలేదు. ఓ ఎద్దు ప్రసాదం తినడం కనిపించింది. కంగారుపడ్డ దంపతులు ఆ చుట్టుపక్కల అంతా వెతికారు. కానీ మంగళసూత్రం మాత్రం కనిపించలేదు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఎద్దు ప్రసాదంతో పాటు మంగళసూత్రాన్ని కూడా మింగేసి ఉంటుందని చెప్పారు. పేడతో పాటు వస్తుందని సూచించారు. దాంతో ఆ దంపతులు ఓ వారం రోజుల పాటు ఆ ఎద్దు పేడను జాగ్రత్తగా దాచి ఉంచారు. కానీ లాభం లేకపోవడంతో చివరకు వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి జరిగిన విషయం చెప్పారు. దాంతో వైద్యులు ఎద్దుకు స్కాన్ చేయగా.. దాని కడుపులో మంగళసూత్రం కనిపించింది. ఈ క్రమంలో ఈ నెల 8న ఎద్దుకు ఆపరేషన్ చేసి దాని కడుపులో నుంచి మంగళసూత్రాన్ని బయటకు తీశారు. 40గ్రాముల బరువున్న ఈ మంగళసూత్రం ఖరీదు రూ.1.5లక్షలుంటుందని సదరు రైతు తెలిపాడు. ప్రస్తుతం ఎద్దు ఆరోగ్యం బాగానే ఉందని.. నెల రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిందిగా వైద్యులు సూచించారని పేర్కొన్నాడు. -
మంగళ సూత్రం తాకట్టుపెట్టి...
బీహార్ః ప్రతిఇంట్లో మరుగుదొడ్లు ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వాటి నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా.. సబ్సిడీలు ఇచ్చినా చాలా ప్రాంతాల్లో ఆచరణలోకి మాత్రం రావడం లేదు. అయితే బీహార్ కు చెందిన ఓ మహిళ మాత్రం.. మరుగుదొడ్డి సమస్యను అధిగమించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చుకోసం ఏకంగా మంగళ సూత్రాలు తాకట్టు పెట్టేసింది. భర్త అవసరాలకో, కూతుళ్ళ పెళ్ళిళ్ళకో బంగారం, వెండి, నగలు అమ్మకాలు జరపడం, తాకట్టు పెట్టడం చాలా కుటుంబాల్లో జరుగుతుంటుంది. అయితే బీహార్ లోని రోటాస్ జిల్లా, బరఖన్నా గ్రామానికి చెందిన ఫుల్ కుమారి మాత్రం.. టాయిలెట్ నిర్మాణానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో సమస్యగా మారిన మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేందుకు మంగళ సూత్రాలను తాకట్టు పెట్టేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంట్లోనివారు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. జిల్లా అధికారులు మాత్రం ఆమెను ఎంతో అభినందించడంతోపాటు.. ఆమెను ఏకంగా జిల్లా పారిశుద్ధ్య కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు నిర్ణయించారు. వ్యవసాయ కూలీ అయిన భర్త ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో.. ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం కుమారి కుటుంబానికి ఎంతో కష్టసాధ్యమైంది. దీంతో తనవంతు సంపాదనకోసం స్థానిక ప్రైమరీ స్కూల్లో వంటమనిషిగా చేరిన కుమారి.. ఫలితం పెద్దగా లేకపోవడంతో సూత్రాలు తాకట్టు నిర్ణయం తీసుకున్నట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. ఇంట్లోని మగవారు మంగళసూత్రాల తాకట్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి కావలసిన సొమ్ము కోసం కుమారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కుమారి భర్త, ఆమె మామగారు సమక్షంలోనే ఆమె ఇంట్లో టాయిలెట్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఇతర జిల్లా అధికారులతోపాటు తాను హాజరౌతున్నట్లు రోటాస్ జిల్లా మెజిస్ట్రేట్ అనిమేష్ కుమార్ పరాశర్ తెలిపారు. కేవలం పది రోజుల్లోగా నిర్మాణం పూర్తయ్యేట్లు చూస్తామని, జిల్లాలోనే ఇతరులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిన కుమారిని పారిశుద్ధ్య కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నట్లు పరాశర్ వెల్లడించారు. -
రిజిస్ట్రార్ పుస్తెలతాడు స్నాచింగ్
హైదరాబాద్: వాకింగ్ చేస్తున్న ఓ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మెడలోని పుస్తెలతాడును బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తెంచుకొని పారిపోయారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కవితా దర్యానిరావు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం ఆమె ఎమ్మెల్యే కాలనీ నుంచి వాకింగ్ చేసుకుంటూ కేబీఆర్ పార్కు వైపు వెళ్తున్నారు. కాలనీలోని ఆంధ్రబ్యాంక్ సమీపంలోకి రాగానే నంబర్‌ప్లేట్ లేని బైక్‌పై హెల్మెట్లు ధరించి ఇద్దరు దుండగులు ఎదురుగా వచ్చారు. ఒక్కసారిగా వారు కవిత మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు పుస్తెలతాడును లాగారు. అప్రమత్తమైన ఆమె పుస్తెలతాడును గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో పెనుగులాట జరిగి కవిత కిందపడిపోయారు. ఇదే అదనుగా దుండగులు పుస్తెలతాడు పట్టుకొని పారిపోయారు. ఈ ఘటనలో స్వల్పగాయాలకు గురైన బాధితురాలు కవితను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. వారం రోజుల వ్యవధిలో ఎమ్మెల్యే కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు స్నాచర్ల బారిన పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ మెడలోని మంగళసూత్రం స్నాచింగ్
రెండు ఠాణాల మధ్య వివాదం పెట్టిన స్నాచర్లు చాంద్రాయణగుట్ట: ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై వెళుతున్న ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుర్తు తెలియని యువకులు తెంచుకొని ఉడాయించారు. చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్ కథనం ప్రకారం.....శంషాబాద్ బహదూర్‌పురా గ్రామానికి చెందిన జగదాంబ(50) రక్షాపురానికి వచ్చింది. ఆదివారం ఉదయం 7.30కి తన ఇద్దరు కుమారులతో కలిసి బైక్‌పై బహదూర్‌పురా గ్రామానికి బయల్దేరారు. ఎర్రకుంటలోని సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రానికి వెళ్లగానే వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు జగదాంబ మెడలోని మూడు తులాల మంగళ సూత్రాన్ని తెంచుకొని ఉడాయించారు. బైక్‌పై నుంచి లాగడంతో కింద పడ్డ జగదాంబ స్వల్పగాయాలకు గురైంది. కాగా నిందితుడు వేసుకున్న టీ షర్ట్ వెనుక భాగం పసుపు రంగులో ఉన్నట్లు బాధితులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సరిహద్దు లొల్లి.. చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల సరిహద్దులో మహిళ మెడలోని గొలుసు చోరీ చేసిన దుండగులు రెండు పోలీస్స్టేషన్ల మధ్య వివాదాన్ని సృష్టించారు. స్నాచింగ్ విషయం తెలుసుకున్న వెంటనే చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రామారావు, అదనపు ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఘటనా స్థలికి చేరుకొని తమ పరిధి కాదని పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ చలపతి, ఎస్సై రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి తమ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. తమకు రాదంటే తమకు రాదంటూ రెండు ఠాణాల అధికారులు భీష్మించుకొని కూర్చొవడంతో చివరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ కూడా అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధి ఎక్కడి వరకు వస్తుందో పరిశీలించిన ఏసీపీ చివరకు ఘటనా స్థలం చాంద్రాయణగుట్ట పరిధిలోకి వస్తుందని అంగీకరించారు. ఈ తతంగమంతా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగడం గమనార్హం. -
మంగళసూత్రం మింగిన దొంగ
గొలుసు రికవరీకి దారేది? బయటకి తీయలేమంటున్న వైద్యులు తలబాదుకుంటున్న పోలీసులు హైదరాబాద్: చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. హైదరాబాద్ చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన శంకరయ్య, ప్రమీల దంపతులు. శనివారం రాత్రి వారు సీతాఫల్మండి రైల్వేస్టేషన్ వైపునకు వాకింగ్ వచ్చారు. అక్కడే తచ్చాడుతున్న మాణికేశ్వరినగర్‌కు చెందిన వికాస్ (22) అనే దొంగ.. ప్రమీల మెడలోని నాలుగు తులాల మంగళసూత్రం తెంపుకొని పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం అర్ధరాత్రి చిలకలగూడలో వికాస్‌ను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా జేబులోంచి గొలుసు తీసి అమాంతం మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు. దీంతో నిందితుడిని ఇన్‌పేషెంట్‌గా చేర్చుకోవాలని పోలీసులు కోరగా అందుకు మొదట వైద్యులు నిరాకరించారు. గొలుసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదని, నిందితుడు మలవిసర్జనకు వెళ్ల్లిన ప్రతిసారీ ఎవరు చెక్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లో ఉంటే తాము కూడా అదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు కూడా సమాధానమిచ్చారు. చివరికి నిందితుడిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు అంగీకరించారు. అయితే, దొంగ మింగిన బంగారం ఎప్పుడు బయటకు వస్తుందో... ఎలా రికవరీ చేయాలో తెలియక పోలీసులు తెగ హైరానా పడుతున్నారు. -
ఫేషియల్ చేస్తానని...
బోడుప్పల్(హైదరాబాద్): ఫేషియల్ చేస్తానని.. పుస్తెలతాడుతో పరారైన ఘటన సోమవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నవీన్‌రెడ్డి కథనం ప్రకారం... పర్వతాపూర్‌లో స్వప్న అనే యువతి కంగన్ బ్యూటీపార్లర్‌ను నిర్విహిస్తోంది. మూడు రోజుల క్రితం 30 ఏళ్ల ఓ యువతి ఈమె వద్దకు వచ్చి బ్యూటీపార్లర్‌లో ఉద్యోగం కావాలని అడిగింది. తన పేరు సంధ్య అని, ఉప్పల్ కూరగాయల మార్కెట్ వద్ద ఉంటానని చెప్పింది. రెండు రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన సంధ్య సోమవారం నిర్వాహకురాలు స్వప్నకు పేషియల్ చేస్తానని కోరింది. ఆమె ఒప్పుకోవడంతో ఫేషియల్ చేయడం మొదలెట్టింది. ఫేషియల్ చేసేందుకు మెడలోని పుస్తెలతాడు అడ్డొస్తోందని చెప్పింది. దీంతో స్వప్న పుస్తెలతాడు తీసి టేబుల్‌పై పెట్టింది. ఫేషియల్ చేస్తూ కళ్లపై దోసకాయ ముక్కలు పెట్టిన సంధ్య.. గుట్టుచప్పుడు కాకుండా టేబుల్‌పై ఉన్న యజమానురాలి 3 తులాలు పుస్తెల తాడు తీసుకొని ఉడాయించింది. -
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళ
ప్రతి మనిషికి, ఇంటికి నిత్యవసరమైనది మరుగుదొడ్డి. ఆ మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఓ మహిళ ఏకంగా తన మంగళసూత్రాన్నే అమ్మేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషీం జిల్లాలోని సాయిఖేదా గ్రామంలో చోటుచేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన అక్కడి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే గురువారం సత్కరించారు. మరుగుదొడ్డి సౌకర్యం లేక ముఖ్యంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆమె విలేరులతో చెప్పింది. అయితే మరుగుదొడ్డిని కట్టించడానికి తన మంగళ సూత్రాన్ని, మిగతా అభరణాలను అమ్మినట్టు సంగీతా పేర్కొంది. దేశంలోనూ, రాష్ట్రంలో పలుచోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పంకజా ముండే చెప్పారు. శాసనసభ్యురాలైన తొలిరోజు నుంచి 25 శాతం మేర నిధులను మరుగుదొడ్ల నిర్మాణానికే కేటాయిస్తాన్నట్టు తెలిపారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్నీ మరుగుదొడ్లు నిర్మించాలనేది తమ లక్ష్యమని ముండే పేర్కొన్నారు.