మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళ
ప్రతి మనిషికి, ఇంటికి నిత్యవసరమైనది మరుగుదొడ్డి. ఆ మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఓ మహిళ ఏకంగా తన మంగళసూత్రాన్నే అమ్మేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని వాషీం జిల్లాలోని సాయిఖేదా గ్రామంలో చోటుచేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన అక్కడి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండే గురువారం సత్కరించారు.
మరుగుదొడ్డి సౌకర్యం లేక ముఖ్యంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆమె విలేరులతో చెప్పింది. అయితే మరుగుదొడ్డిని కట్టించడానికి తన మంగళ సూత్రాన్ని, మిగతా అభరణాలను అమ్మినట్టు సంగీతా పేర్కొంది. దేశంలోనూ, రాష్ట్రంలో పలుచోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పంకజా ముండే చెప్పారు. శాసనసభ్యురాలైన తొలిరోజు నుంచి 25 శాతం మేర నిధులను మరుగుదొడ్ల నిర్మాణానికే కేటాయిస్తాన్నట్టు తెలిపారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్నీ మరుగుదొడ్లు నిర్మించాలనేది తమ లక్ష్యమని ముండే పేర్కొన్నారు.