
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ.
మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు.
ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు.
పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు.
- బి. నర్సన్
వ్యాసకర్త కవి, కథకుడు
మొబైల్ : 9440128169
Comments
Please login to add a commentAdd a comment