rudrangi
-
ఓటీటీకి వచ్చేసిన జగపతిబాబు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్) తాజాగా ఈ చిత్రం రిలీజై నెలరోజులు కాకముందే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 1వ తేది మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. స్వాతంత్య్రం అనంతర తెలంగాణలోని సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. భీమ్రావ్ దేశ్‌ముఖ్‌గా జగపతిబాబు నటించారు. (ఇది చదవండి: నిర్మాతతో సహజీవనం.. నటి సంచలన ఆరోపణలు!) -
రుద్రంగి విజయంతో హ్యాపీ
‘‘రుద్రంగి’ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాం. ఇప్పుడు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండటం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అని దర్శకుడు అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, నవీనా రెడ్డి ముఖ్య ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. ‘‘థియేటర్లోనే చూడాల్సిన సినిమా ఇది. ప్రేక్షకులు మాకు ఇంకా స΄ోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అని ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆశిష్ గాంధీ అన్నారు. -
‘లెజెండ్’ సినిమాను గుర్తుచేసుకున్న జగపతిబాబు
'మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ సినిమా అవకాశం వచ్చింది. అది నా సెకండ్ ఇన్నింగ్స్ అని అందరూ పేరు పెట్టారు. ‘రుద్రంగి’కి నా థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఇందులోని నా పాత్రలో దమ్ము ఉంటుంది' అని నటుడు జగపతిబాబు అన్నారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో జగపతిబాబు మాట్లాడుతూ– 'చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్గా విడుదలైన ‘సామజ వరగమన’ మంచి హిట్ అయింది. ‘రుద్రంగి’ కథ కూడా కొత్తగా ఉంటుంది' అన్నారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ– 'జగతిబాబుగారి ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రేమకు, వాంఛకు మధ్య జరిగిన వాస్తవ కథే ‘రుద్రంగి’. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా సినిమా తీశా.. ఇప్పుడు ‘రుద్రంగి’ తీశా. అంతేగానీ ఎమ్మెల్యే అని ఈ సినిమా తీయలేదు. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి' అన్నారు. -
'యమదొంగ తర్వాత ఆమెకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు'
'యమదొంగ’ సినిమాలో మమతా మోహన్ దాస్‌గారి నటనంటే నాకు ఇష్టం. ఆమె క్యాన్సర్ నుంచి కోలుకోవడంతో ‘రుద్రంగి’లో నటించమని కోరాను. ‘పదేళ్ల నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు.. నన్ను సంప్రదించినందుకు థ్యాంక్స్’ అన్నారామె' అని డైరెక్టర్ అజయ్ సామ్రాట్ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్, గానవి లక్ష్మణ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అజయ్ సామ్రాట్ మాట్లాడుతూ– 'బాహుబలి, రాజన్న’ సినిమాలకు డైలాగ్ రైటర్‌గా చేశాను. ఇక నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’ కథ రాసుకున్నాను. తెలంగాణలో దొరల అణ చివేతల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ‘రుద్రంగి’ని పూర్తి భిన్నంగా ఫ్యామిలీ ఎమోషనల్, సోషల్ డ్రామాగా తీశాను. రసమయిగారికి సినిమా తీయాలనే తపన ఎక్కువగా ఉంది.. నిర్మాతగా ఆయన ఏం చేయగలడో అన్నీ చేశారు. సినిమా బాగుంటే జనాలు చూస్తారు. ‘కాంతారా’కి ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. కానీ, జనాలు విపరీతంగా చూశారు. మా ‘రుద్రంగి’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
వయసు పెరిగినా వన్నె తగ్గని విమలా రామన్ గ్లామర్ (ఫొటోలు)
-
యంగ్ హీరోకి వరుస ఆఫర్స్.. తగ్గేదే లే!
తొలి చిత్రం 'నాటకం'తో ప్రేక్షకుల మనసు దోచేసిన ఆశిష్ గాంధీ.. అప్పటి నుంచి విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకుంటూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి చిత్రంతోనే తన నటనా ప్రతిభను బయటపెట్టిన ఆశిష్.. ఆ తర్వాత 'దర్శకుడు', 'ఉనికి' లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటించారు. మరికొద్ది రోజుల్లో ఆశిష్ గాంధీ నటించిన 'రుద్రంగి' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ సినిమాగా రాబోతున్న ఈ 'రుద్రంగి'లో మల్లేష్ అనే కీలకపాత్ర చేస్తున్నారు. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ ఆశిష్ గాంధీ రోల్‌పై ఆసక్తిని పెంచాయి. జులై 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ ప్రేక్షకులనూ తన నటనతో అలరించేందుకు రెడీ అవుతున్నారు హీరో ఆశిష్ గాంధీ. పికాసో (Picaso) అనే వైవిధ్యభరితమైన చిత్రంతో కేరళ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయబోతున్నారు. దీంతోపాటు మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టేసి సెట్స్‌పై బిజీ బిజీగా ఉంటున్నారు. ఆశిష్ గాంధీ చేస్తున్న తదుపరి సినిమా 'హద్దు లేదు రా'. ఇది ఆగస్టులో విడుదల కానుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో మరో చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. ఇది సెప్టెంబరు నుంచి షురూ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
పిడికెడు మట్టిని పిసికితే చారెడు కన్నీళ్లు రాలిన నేల.. రుద్రంగి చరిత్ర ఇదే!
రుద్రంగి రక్తచరిత్రకు సాక్ష్యం. నిత్య కల్లోలంతో పిడికెడు మట్టిని పిసికితే చారెడు కన్నీళ్లు రాలిన నేల. రాత్రయితే చాలు.. బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇక్కడ పెరిగిన చెట్టుకు.. ఎగిరే పిట్టకు.. పుట్టకు.. గుట్టకు.. కన్నీటి కథలు తెలుసు.. తుపాకీ మోతలు.. గాలిలో కలిసే ప్రాణాలు.. ఇందిరమ్మ బొమ్మ సాక్షిగా తలను వేరు చేయబడిన మొండెం కళ్ల ముందు కనిపించిన దృశ్యం.. అణచివేత... తిరుగుబాటుకు సాక్ష్యం రుద్రంగి. ఊరు పెద్దదే అయినా.. దొరలు, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి చిత్రరూపమిస్తూ.. రుద్రంగి సినిమా రూపుదిద్దుకుంది. ఈ నెల 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రుద్రంగి సినిమాపై ‘సాక్షి’ ఈ వారం సండే స్పెషల్.. – సిరిసిల్ల దాడులు.. ప్రతిదాడులు మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి రుద్రంగి స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రభుత్వం శాంతిచర్చలు జరిపింది. ఈ చర్చలు ముగి యగానే శాంతిని భగ్నం చేస్తూ ఎదురుకాల్పులు జరి గింది ఇక్కడే. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. అంతకుముందు కొచ్చెగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. రుద్రంగి శివారులోని లింగంపేట వద్ద నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు చందుర్తి ఎస్సై శ్రీనివాస్‌రావు మృత్యువాత పడ్డారు. చందుర్తి ఎంపీపీ గంగరాజంను నక్సలైట్లు ఇన్ఫార్మర్గా పేర్కొంటూ రుద్రంగిలో కాల్చిచంపారు. అంతకుముందు లక్ష్మి అనే మహిళను ఇన్ఫార్మర్ నెపంతో తల నరికి ఇందిరమ్మ విగ్రహానికి కట్టిన ఘటన అప్పట్లో సంచలనం. దాడులు, ప్రతిదాడులతో ఆ రుద్రంగి కన్నీటి ధారగా మారింది. పక్కనే దట్టమైన అడవి ఉన్న మానాల, మరిమడ్ల, వట్టిమల్ల, కలికోట, అంబారిపేట గిరిజనతండా, కొత్తపేట, లింగంపేట చుట్టూ ఊర్లతో రుద్రంగి కల్లోలమైంది. రుద్రంగిలో కొండాపూర్ ఎన్కౌంటర్ మృతుల పేరుతో జనశక్తి అమరవీరుల స్థూపం ఉంది. ఆ ఊరిపై ఉద్యమ గీతాలెన్నో జనబాహుళ్యంలోకి వెళ్లాయి. నిర్మాత మనోడే.. రుద్రంగి పేరుతో వస్తున్న ఈ సినిమాను 1960–90 ప్రాంతంలో జరిగిన సంఘటనలు, భూస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో చిత్రీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రానికి నిర్మాత కాగా, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, ఆశీష్గాంధీ, విమలారామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అజయ్సామ్రాట్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మి’ అంటూ జగపతిబాబు చెప్పె డైలాగ్ గంభీరంగా ఉంది. జాలి, దయ లేని భీమ్రావు దొరగా జగపతిబాబు నటిస్తున్నారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్న మేజర్ గ్రామం రుద్రంగిని వెండితెరకు ఎక్కించడం విశేషం. ఆ సినిమా ఎలా ఉంటుంది.. రుద్రంగి టైటిల్‌తో ఏం చెబుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ హీరో బాలకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్లకు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమా విజయవంతం కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా నేపథ్యంలో మరో సినిమా ‘రుద్రంగి’ వెండితెరపైకి రావడం విశేషం. ఎగిసిపడిన ఉద్యమాల ఖిల్లా రుద్రంగి సలుపుతున్న గాయాలముల్లె. వలపోతల కన్నీటిధార. 1975 దశకంలో ఎగిసిపడిన నక్సలైట్ ఉద్యమ కెరటం. చుక్కనీరు దొరకని దైన్యం. నిరుద్యోగం నిచ్చెన మెట్లతో గల్ఫ్ దేశాలకు వలసపోయిన బతుకులు. భూస్వామ్యపు అణచివేతలు.. చుట్టూరా ఎత్తయిన గుట్టలు.. గుట్ట కింద కుప్ప పోసినట్లుగా ఉండే ఇళ్లు. అందులో తాతల నాటి పెంకుటిండ్లే ఎక్కువగా కనిపిస్తాయి. గల్ఫ్ సిరులు తెచ్చిన బిల్డింగులు.. పదిహేను వేల జనాభాతో ఉన్న ఆ పల్లె రుద్రంగిగా వెండితెరకెక్కింది. రుద్రంగి ఒకప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఊరు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఓ మండల కేంద్రం. పసుపు, వరి, మొక్కజొన్న, పత్తి పంటలతో ఆ పల్లె ఇప్పుడు పసిడి రాసులతో తులనాడుతోంది. మా ఊరిలో నేను ఒక్కడినే నటించాను మా సొంతూరు రుద్రంగి. మా ఊరి పేరుతో వస్తున్న సినిమాలో నాకు నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై మా ఊరి అందరిలో ఆసక్తి పెరిగింది. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రుద్రంగి రాబోతుంది. ఆ సినిమాను వెండి తెరపై చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. – తోకల తిరుమల్, రుద్రంగి యువకుడు -
Rudrangi: ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్‌గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’ ఆసక్తికరంగా టీజర్
‘మై నేమ్ ఈజ్ భీం రావ్ దేశ్‌ముఖ్..’ అనే జగపతిబాబు డైలాగ్‌తో ‘రుద్రంగి’ సినిమా టీజర్ విడుదలైంది. జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 26న విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘స్వాతంత్య్రం అన్నది బానిసలకు కాదు.. అది మా కోసం’, ‘గాడు బలవంతుడే రా.. కానీ నేను భగవంతుడు రా..’(జగపతి బాబు), ‘నీకు ఎదురు తిరిగిన మల్లేశ్గాడు ఖతం కావాలె(మమతా మోహన్ దాస్) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. స్వాతంత్య్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు టీజర్లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, భీమ్రావ్ దొరగా జగపతిబాబు
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. ‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR — Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022 -
రాజన్న సిరిసిల్ల: ట్రాక్టర్ హత్య.. పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. భూవివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట గొడవకు దిగారు. దీంతో రుద్రంగి పోలీస్‌స్టేషన్ హైటెన్షన్ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని నేవూరి నరసయ్య (42 ) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే బైక్‌పై వెళ్తున్న నరసయ్యను.. కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో కావాలనే ఢీకొట్టి హతమార్చాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం ఉందని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక హత్య అనంతరం నిందితుడు రుద్రంగి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు మృతుడి బంధువులు. తన భర్తను అన్యాయంగా చంపేశారంటూ పీఎస్ ముందు మృతుడి భార్య బైఠాయించింది. తన తాళి కూడా తీసుకొండంటూ సీఐకి చూపించిందామె. ఈ క్రమంలో బంధువులు పీఎస్‌లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నరసయ్య బంధవులు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో.. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు ఉన్నతాధికారులు. -
వలలో 20 కిలోల చేప.. మనోడికి పండగే పండగ
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు. మానేరు అందాలు.. చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి చెరువు అలుగే జలపాతమై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. – ఇందల్వాయి, రాజ్‌కుమార్ -
గుమ్మానికి వేలాడిన నిరసన సూత్రం
చాలా సంఘటనలు ఇలా జరిగి అలా కాలం పొరల్లోకి వెళ్లిపోతుంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాధాన్యత గల సందర్భాలు కూడా సమాజంపై వేయవలసినంత ముద్ర వేయకుండానే మాములు ఘటనగా సమసిపోతాయి. దానివల్ల వాటి నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఎవరికీ అందకుండానే మిగిలిపోతాయి. అయితే వాటి మూలాల్ని వెదికి ఆయా వ్యక్తులు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన పూర్వాపరాలే మిటో తెలుసుకుంటే అవి వ్యవస్థలో రావలసిన మార్పునకు సూచనలిస్తాయి. ఈ మధ్య ఒక మహిళ తన భూసమస్యను పరిష్కరించమని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి తన మంగళసూత్రాన్ని ఎమ్మార్వో ఆఫీసు ప్రవేశ ద్వారానికి తగిలించింది. తాను ఇంతకన్నా ఏమీ చెల్లించుకోలేను, దీన్ని తీసుకొని నా కార్యం చేసి పెట్టండని వేడుకొంది. ఈ సంఘటన జూన్ 30 నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగింది. ఆ మహిళా రైతు పేరు పొలాస మంగ. మంగకు ఎలాంటి పోరాట, ఉద్యమ నేపథ్యం లేదు. రెండేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా తన భూమిపై హక్కును ఎలా పరిరక్షించుకోవాలో అర్థం కాలేదు. ఆఫీసు లోపల తన తాళి బొట్టును తీసి ఏ ఉద్యోగి చేతిలోనో పెడితే పరిస్థితి ఎలా ఉండేదో గానీ, ఏకంగా ఆఫీసు గుమ్మానికి తగిలించడంతో కలకలం రేగింది. మధ్యలో వేలాడుతూ ఆఫీసులోకి వచ్చే పోయేవారి కంటపడి ఇదేమి చోద్యమనేలా చర్చకు వచ్చింది. ఇదేదో ఉద్రిక్త పరిస్థితికి దారి తీస్తుందన్న బెదురుతో రెవెన్యూ అధికారులు విషయాన్ని స్థానిక పోలీసు స్టేషనుకు చేరవేశారు. ఆ సమయాన జిల్లా కేంద్రంలో ఉన్న డిప్యూటీ తహసీల్దారు హుటాహుటిన ఆఫీసుకొచ్చి ఆమెతో మాట్లాడి సమస్యను తెలుసుకొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్ళి ఆమె అలా ఎందుకు చేయవలసివచ్చిందో కనుక్కున్నారు. వార్త జిల్లా కలెక్టర్ దాకా వెళ్ళింది. సంగతేమిటో చూడమని ఆయన ఆర్డీవోను పుర మాయించారు. ఆ అధికారి స్వయంగా భూమి వద్దకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని ఆమెతో అన్నారు. ఇలా అధికారులు దిగి వచ్చి తన సమస్యను ఆలకిస్తారని ఆమె తాళిని తగిలించేముందు ఊహించి ఉండకపోవచ్చు. ఇదొక అరుదైన ఘటనగా, రెవెన్యూ శాఖ పరువు ప్రతిష్టకు ముడిపడిన విషయంగా భావించి అధికారగణం కదిలి వచ్చిందనుకోవచ్చు. ప్రపంచంలో మహిళలు అతికష్ట సమయంలో ఉద్వేగభరితమైన రీతిలో తమ నిరసనను ప్రదర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. మంగ చూపిన తెగువ కూడా ఆ స్థాయికి తక్కువేమీ కాదు. పదేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్ళిన మంగ భర్త రాజేశం ఎక్కడ, ఎలా ఉన్నాడో సమాచారం లేదు. ప్రస్తుతం కొడుకుతో పాటు మెట్‌పల్లిలోని తన పుట్టినింటిలో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఇదే అదునుగా తన ఎకరం 23 గుంటల భూమిని భర్త తోబుట్టువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె వాదన. మంగ భర్త పరిస్థితిని కూడా తెలుసుకునే పని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఆమె అనుభవాలను, ఆలోచనలను నలుగురి ముందుకు తెచ్చి వాటికి తగిన ప్రాచుర్యం ఇయ్యవలసిన సందర్భమిది. మంగ చూపిన తెగువను ఒక నిరసన బాటగా మలుచుకునే బాధ్యత నారీలోకంపై ఉంది. ప్రభావశీల సంఘటనలు ప్రతిరోజూ జరుగవు. - బి. నర్సన్ వ్యాసకర్త కవి, కథకుడు మొబైల్ : 9440128169 -
తహశీల్దార్ ఆఫీస్: నా తాళిబొట్టును లంచంగా తీసుకోండి.. కానీ
సాక్షి, రుద్రంగి (వేములవాడ): తన పేరిట భూమి పట్టా చేయాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోక పోవడంతో ఆ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. మెడలో ఉండాల్సిన తాళిబొట్టును తీసి తహసీల్దార్ ఆఫీసు గుమ్మానికి తగిలించి అక్కడే బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ మామ పొలాస రాజలింగం పేరిట సర్వేనంబర్ 130/14లో రెండెకరాల వ్యవసాయ పొలం ఉండేది. మంగ భర్త పదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి, తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ బతుకుతోంది. మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని ఆమెకు తెలియకుండానే ఆమె పెద్దమామ తన మనుమని పేరిట పట్టా మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమి పట్టా మార్చాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. బుధవారం మరోసారి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చిన మంగ.. తన దగ్గర పైసలు లేవని, తాళిబొట్టును తీసుకొని పట్టా మార్చాలంటూ రోదిస్తూ కోరింది. తనకు న్యాయం చేసే వరకు వెళ్లేది లేదని బైఠాయించింది. పోలీ సులు వచ్చి సర్ది చెప్పారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులపై, పట్టా చేసుకొ ని భూమిని చదును చేసుకుంటున్న వ్యక్తులపై ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. కావాలనే పట్టా మార్చిండ్రు మా మామ పొలాస రాజలింగం చనిపోయే వరకు ఆ భూమి అతని పేరు మీదనే ఉంది. మామ 2013లో చనిపోయిండు. 2014–15 వరకు మామ పేరు మీదనే ఉంది. అప్పుడున్న తహసీల్దార్, వీఆర్వో లంచం తీసుకొని మా పెద్దమామ మనుమని పేరు మీద పట్టా చేసిండ్రు. విచారణ కూడా చేయకుండానే పట్టా మార్చిండ్రు. నేను అన్ని పత్రాలు ఇచ్చినా పట్టా చేయడానికి ఇబ్బందులు పెడుతుండ్రు. – పొలాస మంగ, బాధితురాలు పట్టా మేం చేయలేదు మంగ భూమి పట్టాను మేము మార్చలేదు. మా కంటే ముందు ఉన్న తహసీల్దార్ పట్టా మార్పు చేశారని పొలాస మంగ ఆరోపిస్తోంది. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్, రుద్రంగి -
గురువుకు ఉపాధి చూపిన విద్యార్థులు
సాక్షి, జగిత్యాల: ప్రాణం పోసిన తల్లికి, పెంచిన తండ్రికి, సద్బుద్ధులు నేర్పిన గురువుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? కానీ కష్టకాలంలో ఉన్న ఓ గురువుకు కొందరు విద్యార్థులు ఉడతా భక్తిగా సాయం చేసి మంచి మనసు చాటుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎందరో ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా తయారైంది. అందులో కోరుట్లకు చెందిన 52 ఏళ్ల హనుమంతుల రఘు కూడా ఒకరు. మాయదారి కరోనా వల్ల హఠాత్తుగా తన టీచర్ వృత్తి కోల్పోవడంతో అతని కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అతని కుమారుడు కూడా నిరుద్యోగి కావడం మరింత కలవరపరిచే అంశం. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు విద్యార్థులు గురువుకు సాయం చేయాలని భావించారు. (ఉపాధ్యాయుడే ఉపాధ్యాయినిపై..) టిఫిన్ సెంటర్ పెట్టుకునేందుకు కొంత స్థలంలో ఓ షెడ్డును కట్టిచ్చారు. వారి సాయానికి ఉప్పొంగిన ఉపాధ్యాయుడు ఆ టిఫిన్ సెంటర్‌కు "గురుదక్షిణ" అని నామకరణం చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. 'నన్ను ఆదుకునేందుకు వచ్చిన నా విద్యార్థులకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదం'టూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఆయన రుద్రంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్లము, జీవశాస్త్రం పాఠాలు నేర్పేవారు. ప్రస్తుతం ఆయనకు సాయం చేసిన విద్యార్థులు 1997-98 బ్యాచ్‌కు చెందిన వారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టిఫిన్ సెంటర్‌కు కస్టమర్లను కూడా తీసుకొస్తామంటూ భరోసా ఇస్తున్నారు సదరు విద్యార్థులు. (‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’) -
రుద్రంగి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ రద్దు
చందుర్తి : జిల్లా ఉపాధ్యాయ సంఘాలు, రుద్రంగి గ్రామస్తుల ఆందోళనతో జిల్లా విద్యాధికారి దిగొచ్చారు. రుద్రంగిని ప్రత్యేక మండలం చేయాలని కోరిన ఉపాధ్యాయుడు అంబటి శంకర్ సస్పెన్షన్ ఎత్తేశారు. విధుల్లో చేరాలని ఉత్తర్వులు అందించారు. దీంతో రుద్రంగి గ్రామస్తులు ఉపాధ్యాయడు శంకర్‌ను పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడి సస్పెన్షన్ ఎత్తివేత ప్రజా విజయమన్నారు. కార్యక్రమంలో సనుగుల సింగిల్ విండో అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, మాల మహానాడు మండల అధ్యక్షుడు బత్తుల కమలాకర్, మండల సాధన కమిటీ సభ్యుడు ఎర్రం నర్సయ్య, తర్రె లింగం, ఒద్యారపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల హర్షం శంకర్ సస్పెన్షన్ ఎత్తివేతతో టీజేఏసీ మండల కన్వీనర్ వికృర్తి లక్ష్మీనారాయణ ,పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎడ్ల కిషన్, డీటీ ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి వంగ తిరుపతి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కట్కూరి ముఖేశ్ తదితరులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.