
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు.
మానేరు అందాలు..
చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి
చెరువు అలుగే జలపాతమై..
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు.
– ఇందల్వాయి, రాజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment