రుద్రంగి రక్తచరిత్రకు సాక్ష్యం. నిత్య కల్లోలంతో పిడికెడు మట్టిని పిసికితే చారెడు కన్నీళ్లు రాలిన నేల. రాత్రయితే చాలు.. బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇక్కడ పెరిగిన చెట్టుకు.. ఎగిరే పిట్టకు.. పుట్టకు.. గుట్టకు.. కన్నీటి కథలు తెలుసు.. తుపాకీ మోతలు.. గాలిలో కలిసే ప్రాణాలు.. ఇందిరమ్మ బొమ్మ సాక్షిగా తలను వేరు చేయబడిన మొండెం కళ్ల ముందు కనిపించిన దృశ్యం.. అణచివేత... తిరుగుబాటుకు సాక్ష్యం రుద్రంగి. ఊరు పెద్దదే అయినా.. దొరలు, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి చిత్రరూపమిస్తూ.. రుద్రంగి సినిమా రూపుదిద్దుకుంది. ఈ నెల 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రుద్రంగి సినిమాపై ‘సాక్షి’ ఈ వారం సండే స్పెషల్..
– సిరిసిల్ల
దాడులు.. ప్రతిదాడులు
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి రుద్రంగి స్కూల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రభుత్వం శాంతిచర్చలు జరిపింది. ఈ చర్చలు ముగి యగానే శాంతిని భగ్నం చేస్తూ ఎదురుకాల్పులు జరి గింది ఇక్కడే. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. అంతకుముందు కొచ్చెగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు.
రుద్రంగి శివారులోని లింగంపేట వద్ద నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు చందుర్తి ఎస్సై శ్రీనివాస్‌రావు మృత్యువాత పడ్డారు. చందుర్తి ఎంపీపీ గంగరాజంను నక్సలైట్లు ఇన్‌ఫార్మర్‌గా పేర్కొంటూ రుద్రంగిలో కాల్చిచంపారు. అంతకుముందు లక్ష్మి అనే మహిళను ఇన్‌ఫార్మర్ నెపంతో తల నరికి ఇందిరమ్మ విగ్రహానికి కట్టిన ఘటన అప్పట్లో సంచలనం. దాడులు, ప్రతిదాడులతో ఆ రుద్రంగి కన్నీటి ధారగా మారింది. పక్కనే దట్టమైన అడవి ఉన్న మానాల, మరిమడ్ల, వట్టిమల్ల, కలికోట, అంబారిపేట గిరిజనతండా, కొత్తపేట, లింగంపేట చుట్టూ ఊర్లతో రుద్రంగి కల్లోలమైంది. రుద్రంగిలో కొండాపూర్ ఎన్‌కౌంటర్ మృతుల పేరుతో జనశక్తి అమరవీరుల స్థూపం ఉంది. ఆ ఊరిపై ఉద్యమ గీతాలెన్నో జనబాహుళ్యంలోకి వెళ్లాయి.
నిర్మాత మనోడే..
రుద్రంగి పేరుతో వస్తున్న ఈ సినిమాను 1960–90 ప్రాంతంలో జరిగిన సంఘటనలు, భూస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో చిత్రీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రానికి నిర్మాత కాగా, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, ఆశీష్‌గాంధీ, విమలారామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అజయ్‌సామ్రాట్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మి’ అంటూ జగపతిబాబు చెప్పె డైలాగ్ గంభీరంగా ఉంది.
జాలి, దయ లేని భీమ్‌రావు దొరగా జగపతిబాబు నటిస్తున్నారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్న మేజర్ గ్రామం రుద్రంగిని వెండితెరకు ఎక్కించడం విశేషం. ఆ సినిమా ఎలా ఉంటుంది.. రుద్రంగి టైటిల్‌తో ఏం చెబుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ హీరో బాలకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్లకు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమా విజయవంతం కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా నేపథ్యంలో మరో సినిమా ‘రుద్రంగి’ వెండితెరపైకి రావడం విశేషం.
ఎగిసిపడిన ఉద్యమాల ఖిల్లా
రుద్రంగి సలుపుతున్న గాయాలముల్లె. వలపోతల కన్నీటిధార. 1975 దశకంలో ఎగిసిపడిన నక్సలైట్ ఉద్యమ కెరటం. చుక్కనీరు దొరకని దైన్యం. నిరుద్యోగం నిచ్చెన మెట్లతో గల్ఫ్ దేశాలకు వలసపోయిన బతుకులు. భూస్వామ్యపు అణచివేతలు.. చుట్టూరా ఎత్తయిన గుట్టలు.. గుట్ట కింద కుప్ప పోసినట్లుగా ఉండే ఇళ్లు. అందులో తాతల నాటి పెంకుటిండ్లే ఎక్కువగా కనిపిస్తాయి. గల్ఫ్ సిరులు తెచ్చిన బిల్డింగులు.. పదిహేను వేల జనాభాతో ఉన్న ఆ పల్లె రుద్రంగిగా వెండితెరకెక్కింది. రుద్రంగి ఒకప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఊరు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఓ మండల కేంద్రం. పసుపు, వరి, మొక్కజొన్న, పత్తి పంటలతో ఆ పల్లె ఇప్పుడు పసిడి రాసులతో తులనాడుతోంది.
మా ఊరిలో నేను ఒక్కడినే నటించాను
మా సొంతూరు రుద్రంగి. మా ఊరి పేరుతో వస్తున్న సినిమాలో నాకు నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై మా ఊరి అందరిలో ఆసక్తి పెరిగింది. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రుద్రంగి రాబోతుంది. ఆ సినిమాను వెండి తెరపై చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది.
– తోకల తిరుమల్, రుద్రంగి యువకుడు
Comments
Please login to add a commentAdd a comment