హైదరాబాద్ : వలస పాలనలో పాలమూరు జిల్లా బాగా వెనకబడిపోయిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అంటే కేవలం కరువు జిల్లాగా పేరు పడిందన్నారు. రాష్ట్రంలో కరువు, జంటనగరాల్లో తాగునీటి సమస్యపై తెలంగాణ అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ... కరువు అనే మహమ్మారి తెలంగాణకు చుట్టంగా మారిందన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలో విద్యుత్ రంగం చిన్నాభిన్నమైందన్నారు.
పాలమూరు, డిండి, సీతారాం, భక్త రామదాసు ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం అకుపచ్చగా కళకళలాడుతుందని చెప్పారు. గత పాలకుల హయాంలో 40 ఏళ్లు అయిన తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మర్రి జనార్దన్రెడ్డి వెల్లడించారు.
కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం చారిత్రక ఒప్పందమని చెప్పారు. రాష్ట్రంలో అటవీశాతాన్ని పెంచెందుకు హరితహరం చేపట్టినట్లు మర్రి జనార్దన్రెడ్డి వివరించారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మర్రి జనార్దన్ రెడ్డి వివరించారు.