
‘మల్లన్న’ రైతు మృతికి కేసీఆర్‌దే బాధ్యత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ ముంపునకు గురవుతామన్న ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ అనవసరమని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నా వినకుండా సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.
సీఎం అనాలోచిత, అవగాహనలేమి చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మల్లన్న సాగర్ నిర్మించి దాని ద్వారా నిజాంసాగర్, శ్రీరాంసాగర్ నింపుతామనడం సీఎం కేసీఆర్ అవగాహన లేమికి నిదర్శనమన్నారు. మల్లన్నసాగర్ అంశంపై త్వరలో గవర్నర్ నరసింహన్‌ను కలసి కాంగ్రెస్ తరఫున వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. గవర్నర్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని సీఎం కేసీఆర్‌ను వివరణ కోరాలన్నారు.