సీఎంవి పిచ్చి పిచ్చి నిర్ణయాలు: మర్రి
హైదరాబాద్: ప్రజల సంక్షేమం మరిచిపోయి పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారశైలి పిచ్చి తుగ్లక్‌ను మించిపోయిందని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పటిష్టంగా, బ్రహ్మాండంగా ఉన్న సచివాలయాన్ని కూల్చేసి, డిఫెన్సు భూమిలో కొత్త సచివాలయం నిర్మిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని తరలించి, ఆ ప్రదేశంలో సచివాలయాన్ని నిర్మించాలని గతంలో ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతమున్న సచివాలయం దాదాపుగా 60 శాతం ఖాళీగా ఉన్నదని, కొత్త సచివాలయం అవసరం ఏమిటని ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమీషన్ డబ్బుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త భవనాలు కట్టాలన్న యోచనలో ఉన్నారని ఆరోపించారు. కొత్త సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.