'ఆయన చిక్కడు దొరకడు'
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ ను కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ నిశితంగా విమర్శించారు. నగర సమస్యలపై పోరాడే విషయంలో పార్టీ నేతలకు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కడు దొరకుడు అంటూ చురక అంటించారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై పదేపదే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇళ్లు మారారనే కారణంతో 24 శాతం ఓట్లు తొలగించారని అన్నారు. ఈ పరిణామాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న తప్పులను హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు.