అత్తాపూర్, న్యూస్‌లైన్: మరో 24 గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావుబాజాలు మోగాయి. రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు అక్క చనిపోగా.. ఇంటి పెద్దతో పాటు మరో 8 మంది బంధువులు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ విషాద సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డెయిరీఫాం ప్రాంతానికి చెందిన సాజిద్‌హుస్సేన్ కుమారుడు అజీజ్‌అహ్మద్‌కు రామంతాపూర్‌కు చెందిన సిమ్రాన్‌ఫిర్దోస్‌తో పెళ్లి కుదిరింది. మంగళవారం సాయంత్రం పెళ్లి ఉండడంతో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పెళ్లికూతురు అక్క నౌసిన్‌ఫిర్దోస్ మరో 8 మందితో కలిసి మెహందీ పెట్టేందుకు పెళ్లికుమారుడి ఇంటికి తవేరా వాహనం (ఏపీ13జె6594)లో బయలుదేరింది. మార్గం మధ్యలో అత్తాపూర్ పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌నెంబర్.136 వద్దకు రాగానే వీరి వాహనం డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరికీ తీవ్రగాయాలు కాగా నౌసిన్‌ఫిర్దోస్ అక్కడికక్కడే మృతి చెందింది. క్షతగాత్రులను రాజేంద్రనగర్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్దోస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో అదిన్, జీబా, నజీమా, ఆజ్మా, అఫ్రీన్, షాహిన్, రిజ్వాన్, అరగ్ ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.