జాప్యాల లీల!
- మక్కా మసీదు హోంగార్డులకు అందని వేతనాలు
- ‘కతీబ్’ నియామకంలోనూ అదే తంతు
- పట్టించుకొని మైనార్టీ శాఖ మంత్రి
దారుషిఫా, న్యూస్‌లైన్: చారిత్రక మక్కా మసీదులో సిబ్బంది వేతనాల చెల్లిపులో జాప్యాల తంతు నడుస్తోంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఆరు నెలలుగా ప్రభుత్వం సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నవంబర్‌లో రావాల్సిన వేతనాలను డిసెంబర్ 27న ఇచ్చారు. డిసెంబర్ వేతనాలు జనవరి ముగుస్తున్నా ఇంతవరకు ఇవ్వలేదని హోంగార్డులు వాపోతున్నారు. మక్కా మసీదులో 20 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిండగా ఒక్కొక్కరికీ నెలకు రూ. 6,000 వేతనంగా చెల్లిస్తున్నారు.
ఇచ్చే కొద్దిపాటి వేతనం కూడా సమయానికి అందక తమ కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారికి ఎన్నోసార్లు తెలిపినా సకాలంలో జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయలేదన్నారు. మరో రెండు రోజుల్లో వేతనాలను ఇవ్వకుంటే సమ్మెకు దిగుతామన్నారు. ఇదిలావుండగా, నిధుల కొరత వల్లే వేతనాలు చెల్లించలేదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ అధికారి ఆర్.మహేందర్ రెడ్డి తెలిపారు.
‘కతీబ్’ నియమాకం ఎప్పుడు?
మక్కా మసీదు ‘కతీబ్’ (శుక్రవారం ప్రార్థన చేయించేవారు) నియామకంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తోంది. మక్కా కతీబ్ సెప్టెంబర్ చివరి వారంలో పదవీ విరమణ చేసినా ఇప్పటి వరకు కొత్తవారిని నియమించడంలో మైనార్టీ సంక్షేమ శాఖ జాప్యం చేస్తోంది. దీంతో తాత్కాలికంగా హఫేజ్ రిజ్వాన్ ఖురేషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మక్కా మసీదు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యపు ధోరణిపై ముస్లిం మైనార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అహ్మదుల్లా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని, అందుకే ఈ సమస్యలు పరిష్కారం కాలేదని పలు ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.