పాడి ఆదాయం పెంచండి: చిన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాడి రైతుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని, లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఎన్.పద్మావతీ రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డితో కలసి మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన పోత్సాహకాన్ని వెంటనే చెల్లించే విధంగా, పాడిరైతుల తలసరి ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
దళితుల సంక్షేమం ఎక్కడ?: సంపత్
సాక్షి, హైదరాబాద్: దళితులకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ విమర్శించారు. సంక్షేమం విషయంలో అసెంబ్లీని తప్పుదోవ పట్టించేవిధంగా ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపిందన్నారు. 2012–16లో ప్రభుత్వం ఇప్పటిదాకా మార్జిన్‌మనీ విడుదల చేయలేదన్నారు.
నిమ్స్‌లో ఎమ్మెల్సీకే వైద్యం చేయలేదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యరంగంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. సాక్షాత్తూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలనే టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ వైద్యం కోసం నిమ్స్‌కు వెళ్తే చికిత్సలు అందలేదన్నారు. చట్టసభ సభ్యునికే వైద్యం అందించలేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అంచనా వేయవచ్చన్నారు.
కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న రేవంత్‌రెడ్డి
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: వర్షాలకు కల్లాల్లో ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి ఒకప్పుడు ఉండేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల కష్టాలు గుర్తించి రూ.1,024 కోట్లతో 330 గోదాంలు నిర్మించినట్లు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారు మాట్లాడుతూ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి సమాచార చట్టం ద్వారా వివరాలు తెలుసుకుని కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయొద్దని రేవంత్‌ను హెచ్చరించారు.
మీడియా పాయింట్
Published Tue, Dec 20 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
Advertisement
Advertisement