పేదల చెంతకు వైద్యవిద్య
Published Mon, Oct 3 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
అమీర్‌పేట: నిరుపేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని కేంద్ర కార్మిక,ఉపాధి కల్పన శాఖమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్యకళాశాలలో నూతన విద్యార్థులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల ద్వారా కార్మికుల పిల్లలకు తక్కువ ఖర్చుతో మెడిసిన్ చదివే అవకాశం కల్పించిందన్నారు.
సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలలోని 100 సీట్లలో కార్మిక కుటుంబాల వారికి 50 సీట్లు, అందులో తెలంగాణ రాష్ట్రంకు చెందిన విద్యార్థులకు కేటాయించామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెడికల్ కౌన్సిల్ విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కళాశాలకు ప్రథమ బ్యాచ్‌లో చేరిన వైద్య విద్యార్థులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగంలో టాపర్‌లుగా నిలిచే వారికి నరేంద్రదత్త వైద్య విద్య ట్రస్టు ద్వారా బంగారు పతకాలు, నగదు అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు.త్వరలోప్రధాని వైద్య కళాశాలను సందర్శిస్తారన్నారు. అనంతరం వైద్య విద్యార్థులను పరిచయం చేసుకున్నారు.
Advertisement
Advertisement