మందుల ‘మాయాజాలం’!
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గినా, పెరిగినా క్షణాల్లో అమల్లోకి వస్తాయి. కానీ మనుషుల జబ్బులు నయంచేసే మాత్రలకు మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు. మందులోళ్లు ధరల విషయంలో పెద్ద మాయలోళ్లుగా మారుతున్నారు. ధరలు తగ్గించమని కేంద్రం ఆదేశించినా పేద రోగుల ముక్కుపిండి మరీ పాత ఎంఆర్‌పీ రేట్లు వసూలు చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే తగ్గించిన ధరలు అమల్లోకి రాకపోతే.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, హైదరాబాద్
డీపీసీవో నిర్దేశించిన దానికంటే అధిక ధరకు మందుల అమ్మకం
రోగులను నిలువుదోపిడీ చేస్తున్న ఫార్మసిస్టులు
తెలంగాణ వ్యాప్తంగా 65 రకాల మందుల గుర్తింపు
రాష్ట్రంలో మందుల కంపెనీలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కై రోగులను నిలువునా దోచేస్తున్నారు. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల (డీపీసీవో)కు విరుద్ధంగా అధిక ధరకు మందులను అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే లేడు. డీపీసీవో ప్రకారం ఎక్టాస్‌లోన్(5) ఒక టాబ్లెట్ ధర రూ.0.58 పైసలు. కానీ ఇదే మందును మార్కెట్లో రూ.1.29 పైసలకు విక్రయిస్తున్నారు. అక్రుట్-4 టాబ్లెట్ ధర రూ.38.54 ఉండగా, రూ.47కు విక్రయిస్తున్నారు. ‘క్యాల్షియం గ్లుకోనెట్’ మందు, ఇంజక్షన్ల ధరలను ఒక్కో కంపెనీ ఒక్కోరకంగా ముద్రించి విక్రయిస్తున్నారు. ఇలా 65 రకాల మందులు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున ్నట్లు తాజాగా రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి గుర్తించింది.
సామాన్య రోగులకు సరసమైన ధరకే అత్యవసర మందులు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు 2013లో జాతీయ అత్యవసర మందుల జాబితా(ఎన్‌ఎల్‌ఈఎం)ను సిద్ధం చేసి.. డీపీసీవో పరిధిలోకి 348 రకాల మందులను తెచ్చింది. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు తగ్గించింది. తాము నిర్దేశించిన ధరకే మందులు విక్రయించాలని ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటిలో 65 రకాల మందులు ఎక్కువ (పాత) ధరలకే విక్రయిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఇటీవల పలు మెడికల్ ఏజెన్సీలు, మందుల దుకాణాల్లో రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేయడంతో అసలు విషయం వెల్లడైంది. తగ్గిన ధర ప్రకారం మందులు అమ్మాల్సి ఉండగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల యజమానులు కుమ్మక్కై అధిక ధరకు అమ్ముతూ రోగులను దోచుకుంటున్నట్లు గుర్తించారు.