petrol costs
-
పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు!
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్) విధించింది. ఫలితంగా దేశీ అవసరాలను పట్టించుకోకుండా, లాభాల కోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలకు కళ్లెం వేసినట్టయింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతేకాదు, జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఎగుమతులపై పన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్, రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీపై ప్రభావం చూపించనుంది. ఈ రెండు సంస్థలు తమ రిఫైనరీ ప్లాంట్లలో ముడి చమురును శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటాయి. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను విధింపు నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాతోపాటు, ప్రైవేటు రంగంలోని కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ (వేదాంత)పై ప్రభావం చూపించనుంది. ఏటా 29 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. టన్నుకు రూ.23,250 విండ్‌ఫాల్ ట్యాక్స్‌తో కేంద్రానికి రూ.66,000 కోట్లు సమకూరనుంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటే? కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా చెబుతారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈ పన్ను విధానం అమల్లో ఉంది. విండ్‌ఫాల్ ట్యాక్స్కుతోడు, ఎగుమతులపై పన్ను రూపంలో కేంద్రానికి సుమారు రూ.లక్ష కోట్లు సమకూరనుంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించి కొతం ఊరట కల్పించడం తెలిసిందే. దీనివల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. తాజా నిర్ణయాలో ఖజానాకు ఈ మొత్తం భర్తీ కానుంది. అంతర్జాతీయ పరిణామాల ఫలితం ఇటీవలే బ్రిటన్ అసాధారణ పెట్రో లాభాలపై 25 శాతం పన్ను విధించడం గమనార్హం. తాజా నిర్ణయంతో భారత్ కూడా బ్రిటన్ బాటలో నడిచినట్టయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం ఐరోపా సమాఖ్య రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవడం మొదలు పెట్టింది. దీన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ మంచి అవకాశంగా భావించాయి. ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి, ఎగుమతి చేస్తుండడం గమనార్హం. దీంతో ఎగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం పన్నులు విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) 5.7 మిలియన్ టన్నుల డీజిల్, 2.5 మిలియన్ టన్నుల పెట్రోల్ దేశం నుంచి ఎగుమతి అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ దేశీయంగా పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు. ఆయిల్ మార్కెటింగ్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్ విక్రయ ధరలను సవరించకుండా కొంత కాలంగా నియంత్రణ పాటిస్తున్నాయి. దీంతో పీఎస్‌యూల మాదిరే తక్కువ రేట్లకు పెట్రోల్ ఉత్పత్తులను విక్రయించడం వల్ల భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రిలయన్స్, నయారా ఎనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల మాదిరి తక్కువ రేట్లకు విక్రయించకపోతే అవి మార్కెట్ వాటాను నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అవి స్థానిక విక్రయాలను తగ్గించుకుని కొంత మేర ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను విధిస్తున్నాం’’అని ఆర్థిక శాఖ తెలిపింది. నూతన లెవీ అన్నది చమురు కంపెనీలు పొందుతున్న ధరలో 40 శాతానికి సమానమని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువ ఉత్పత్తి చేసిన సంస్థలకు ఈ పన్నును మినహాయించినట్టు తెలిపింది. కళ్లు చెదిరే లాభాలు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 112 డాలర్ల స్థాయిలో ఉంది. లోగడ ఇది 139 డాలర్లకూ వెళ్లింది. ఫలితంగా ఓఎన్జీసీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40,306 కోట్ల లాభం ఆర్జించింది. ఆయిల్ ఇండియా రూ.3,887 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఎగుమతులతో అద్భుత లాభాలు దేశీ సరఫరాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం ద్వారా కొన్ని ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అద్భుత లాభాలు గడిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనివల్లే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి పన్ను విధించాల్సి వచ్చినట్టు చెప్పారు. ఎగుమతి పన్నుతోపాటు, దేశీయ ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపారు. ప్రైవేటు తయారీ సంస్థలు ఎగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని, దీంతో దేశీయ సరఫరా పెంచేందుకు కొత్త పన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించారు. లాభాలు పెంచుకునే సంస్థల పట్ల తాము కక్ష సాధించడం లేదని స్పష్టం చేశారు. ఎగుమతులపైనా పరిమితులు.. ఒకవైపు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై పన్ను విధించిన కేంద్ర సర్కారు.. మరోవైపు ఎగుమతుల పరిమాణంపై పరిమితులు విధించింది. దేశీయంగా వీటి అందుబాటు పెంచడమే ఈ చర్యల ఉద్దేశ్యం. 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసే పెట్రోల్ పరిమాణంలో సగం మేర దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అదే డీజిల్, గ్యాస్ అయితే ఎగుమతి పరిమాణంలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలని ఆర్థిక శాఖ పరిమితి పెట్టింది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ మరింత అందుబాటులోకి వస్తుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల పెట్రోల్ పంపులు ఎప్పుడూ నో స్టాక్ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. కేంద్రం పెట్టిన పరిమితులతో ఇకమీదట ఈ పరిస్థితి ఉండదు. భూటాన్, నేపాల్ దేశాలకు ఎగుమతులను ఈ నిబంధనల పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. అలాగే, నూరు శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌లలోని యూనిట్లకు ఎగుమతుల పరిమాణం పరిమితులు వర్తించవు. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ రిఫైనరీ అయినా కానీ, ఎగుమతులపై పన్ను ఒకే విధంగా అన్నింటికీ అమలవుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్ నగర్లో రెండు రిఫైనరీలు ఉన్నాయి. -
Fuel Price hike: పెట్రోల్‌ని క్రాస్ చేసిన డీజిల్
హైదరాబాద్: ఇంధన ధరల పెరుగుదలలో పెట్రోల్‌ని డీజిల్ క్రాస్ చేసింది. గత నలభై నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను పరిశీలిస్తే... పెట్రోలు కంటే డీజిల్ ధరలే ఎక్కువగా పెరిగాయి. గడిచిన 44 రోజుల్లో ఇంధన ధరలను 25 సార్లు పెంచాయి చమురు కంపెనీలు. ఇలా 25 సార్లు పెరిగిన ధరల మొత్తాన్ని కలిపితే లీటరు పెట్రోలుపై రూ. 6.26 డీజిల్‌పై రూ. 6.68 ధర పెరిగింది. మొత్తంగా పెట్రోలు కంటే డీజిల్ ధర 42 పైసలు ఎక్కువగా పెరిగింది. సెంచరీ దిశగా డీజిల్ బెంగాల్ ఎన్నికలు ముగిసింది మొదలు చమురు కంపెనీలు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పేరు చెప్పి ఇంధన ధరలు పెంచుకుంటూ పోయాయి. ఇప్పటికే దేశంలో చాలా చోట్ల లీటరు పెట్రోలు ధర వంద దాటగా తాజాగా డీజిల్ సెంచరీకి చేరువగా వస్తోంది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో డీజిల్ ధర వందను దాటేసింది. ఇక్కడ లీటరు డీజిల్ ధర రూ. 100.51గా నమోదైంది. ఇదే ట్రెండ్ మరో నెలరోజులు కంటిన్యూ అయితే తెలుగు స్టేట్స్‌లోనూ లీటరు డీజిల్ ధర వందను దాటం ఖాయమనేట్టుగా ఉంది పరిస్థితి. చదవండి : హోప్ ఎలక్ట్రిక్: సింగిల్ ఛార్జ్ తో 125 కి.మీ. ప్రయాణం -
పెట్రో మంటలు
సాక్షి, హైదరాబాద్ : అవి పైసలే.. రోజూ కొన్ని పైసలే.. అసలు మనం లెక్కలోకి తీసుకోని పైసలే.. కానీ పైసలు పైసలు కలసి రూపాయలై బండెడు బరువుగా మారిపోయాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేసి, రోజువారీగా మార్చే విధానం అమలు చేసినప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గినా దేశంలో ధరలు తగ్గించకుండా పన్నులు పెంచుతూ సమానం చేయడం.. ధరలు పెరిగితే మాత్రం పెంచుకుంటూ వెళ్లడం.. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో.. బండి బయటికి తీద్దామంటే భయమేస్తోందని వాహనదారులు వాపోతున్నారు. నొప్పి తెలియకుండా.. చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.92కు, డీజిల్ ధర రూ.68.79కు చేరాయి. సగానికిపైగా మోత పన్నులతోనే.. పెట్రోల్, డీజిల్ అసలు ధరలకు.. వినియోగదారుడికి చేరేవరకు ఉన్న ధరలకు అసలు పోలికే లేదు. ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న ధరలో సగానికిపైగా కేంద్ర రాష్ట్రాల పన్నులు, సుంకాలే ఉండడం గమనార్హం. దీనికితోడు దాదాపు రెండేళ్ల కింద అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గించకుండా.. సుంకాలు పెంచి ధరల వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకుంది. అలా రెండు మూడు సార్లు సుంకాలు పెంచింది. తర్వాత పెట్రోల్, డీజిల్‌ల ధరలను కూడా కొద్దిగా తగ్గించింది. అయితే కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో దేశంలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ వస్తున్నారు. పెంపుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా తరచూ పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ కింద ఒక్కో లీటర్ పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు అంచనా. రెండో స్థానంలో తెలుగు రాష్ట్రాలు పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. దీంతో పెట్రోల్‌పై పన్ను 43.71 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్కుతోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి. ఇక ముందు బాదుడే! అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రస్తుతం ఇండియన్ క్రూడ్ బాస్కెట్ (బ్యారెల్) ధర రూ.4,085గా ఉంది. ఒక బాస్కెట్లో 159 లీటర్ల చమురు ఉంటుంది. దానిని రిఫైనరీల్లో శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లతో పాటు ఇతర ఉత్పన్నాలను వేరుచేస్తారు. వాటిని వేర్వేరు ధరలతో విక్రయిస్తారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ఉత్పత్తి ఖర్చులు మాత్రం ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే ఉంటాయి. మిగతాదంతా పన్నుల భారమే. జీఎస్టీలోకి చేర్చితే తగ్గుతాయా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను అందులో చేర్చలేదు. రాష్ట్రాలకు దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అడ్డగోలు పన్నులు తగ్గించాలి ‘‘పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. అందువల్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను పోటు వేయడం తగదు. జీఎస్టీ పరిధిలోకి చేర్చితే ధరలు దిగివస్తాయి..’’ – రియాజ్ ఖాద్రీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ చైర్మన్ పైసలు తగ్గిస్తూ.. రూపాయల్లో పెంచుతున్నారు ‘‘అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడం లేదు. పెరిగినప్పుడు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడు పైసలు మాత్రమే తగ్గిస్తూ.. పెంచినప్పడు రూపాయల్లో బాదుతున్నారు.. ఇలాగైతే ఎలా..?’’ – సతీష్ దేవ్కట్, మిట్టికాషేర్ (16సీహెచ్ఎం22) డ్రైవింగ్ ఫీల్డ్ వదిలేద్దామనిపిస్తోంది.. ‘‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను చూస్తే భయమేస్తోంది. రోజంతా పనిచేసినా తగిన ఫలితం లేదు. వాహనాన్ని క్యాబ్ లింకులో పెట్టాను. ఎక్కడ ఆర్డర్ వస్తే అక్కడికి పోవాల్సిందే. బండి ఫైనాన్స్‌లో ఉంది కాబట్టి తిరగక తప్పడం లేదు. ఫీల్డ్నే వదిలేయాలనిపిస్తోంది..’’ – యూనస్, తార్నాక (16టీఏఆర్73) వాహనదారులపై మోయలేని భారం ‘‘ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనాన్ని వినియోగించక తప్పని పరిస్థితి. ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతే మోయలేని భారం పడుతోంది. ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి..’’ – శ్రీకాంత్‌రెడ్డి, నానక్‌రాంగూడ (16జీసీబీ44పి–160054) -
మందుల ‘మాయాజాలం’!
-
మందుల ‘మాయాజాలం’!
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గినా, పెరిగినా క్షణాల్లో అమల్లోకి వస్తాయి. కానీ మనుషుల జబ్బులు నయంచేసే మాత్రలకు మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు. మందులోళ్లు ధరల విషయంలో పెద్ద మాయలోళ్లుగా మారుతున్నారు. ధరలు తగ్గించమని కేంద్రం ఆదేశించినా పేద రోగుల ముక్కుపిండి మరీ పాత ఎంఆర్పీ రేట్లు వసూలు చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే తగ్గించిన ధరలు అమల్లోకి రాకపోతే.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. - సాక్షి, హైదరాబాద్ డీపీసీవో నిర్దేశించిన దానికంటే అధిక ధరకు మందుల అమ్మకం రోగులను నిలువుదోపిడీ చేస్తున్న ఫార్మసిస్టులు తెలంగాణ వ్యాప్తంగా 65 రకాల మందుల గుర్తింపు రాష్ట్రంలో మందుల కంపెనీలు మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కై రోగులను నిలువునా దోచేస్తున్నారు. ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వుల (డీపీసీవో)కు విరుద్ధంగా అధిక ధరకు మందులను అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే లేడు. డీపీసీవో ప్రకారం ఎక్టాస్లోన్(5) ఒక టాబ్లెట్ ధర రూ.0.58 పైసలు. కానీ ఇదే మందును మార్కెట్లో రూ.1.29 పైసలకు విక్రయిస్తున్నారు. అక్రుట్-4 టాబ్లెట్ ధర రూ.38.54 ఉండగా, రూ.47కు విక్రయిస్తున్నారు. ‘క్యాల్షియం గ్లుకోనెట్’ మందు, ఇంజక్షన్ల ధరలను ఒక్కో కంపెనీ ఒక్కోరకంగా ముద్రించి విక్రయిస్తున్నారు. ఇలా 65 రకాల మందులు ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున ్నట్లు తాజాగా రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి గుర్తించింది. సామాన్య రోగులకు సరసమైన ధరకే అత్యవసర మందులు అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు 2013లో జాతీయ అత్యవసర మందుల జాబితా(ఎన్ఎల్ఈఎం)ను సిద్ధం చేసి.. డీపీసీవో పరిధిలోకి 348 రకాల మందులను తెచ్చింది. ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు తగ్గించింది. తాము నిర్దేశించిన ధరకే మందులు విక్రయించాలని ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కానీ వీటిలో 65 రకాల మందులు ఎక్కువ (పాత) ధరలకే విక్రయిస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఇటీవల పలు మెడికల్ ఏజెన్సీలు, మందుల దుకాణాల్లో రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేయడంతో అసలు విషయం వెల్లడైంది. తగ్గిన ధర ప్రకారం మందులు అమ్మాల్సి ఉండగా పలువురు డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల యజమానులు కుమ్మక్కై అధిక ధరకు అమ్ముతూ రోగులను దోచుకుంటున్నట్లు గుర్తించారు.