పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! | Centre Imposes Export Tax On Petrol,diesel,jet Fuel | Sakshi
Sakshi News home page

పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు!

Published Sat, Jul 2 2022 7:06 AM | Last Updated on Sat, Jul 2 2022 8:17 AM

Centre Imposes Export Tax On Petrol,diesel,jet Fuel - Sakshi

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) విధించింది. ఫలితంగా దేశీ అవసరాలను పట్టించుకోకుండా, లాభాల కోసం ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్న సంస్థలకు కళ్లెం వేసినట్టయింది.

ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్‌ పెట్రోల్‌పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్‌పై రూ.6, లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అంతేకాదు, జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఎగుమతులపై పన్ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్, రోజ్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీపై ప్రభావం చూపించనుంది. ఈ రెండు సంస్థలు తమ రిఫైనరీ ప్లాంట్లలో ముడి చమురును శుద్ధి చేసి ఎగుమతి చేస్తుంటాయి.

దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను విధింపు నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాతోపాటు, ప్రైవేటు రంగంలోని కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ (వేదాంత)పై ప్రభావం చూపించనుంది. ఏటా 29 మిలియన్‌ టన్నుల క్రూడాయిల్‌ దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. టన్నుకు రూ.23,250 విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో కేంద్రానికి రూ.66,000 కోట్లు సమకూరనుంది. 

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ అంటే?
కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వచ్చే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా చెబుతారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఈ పన్ను విధానం అమల్లో ఉంది. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌కుతోడు, ఎగుమతులపై పన్ను రూపంలో కేంద్రానికి సుమారు రూ.లక్ష కోట్లు సమకూరనుంది. ఇటీవల ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గించి కొతం ఊరట కల్పించడం తెలిసిందే. దీనివల్ల రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. తాజా నిర్ణయాలో ఖజానాకు ఈ మొత్తం భర్తీ కానుంది.  

అంతర్జాతీయ పరిణామాల ఫలితం   
ఇటీవలే బ్రిటన్‌ అసాధారణ పెట్రో లాభాలపై 25 శాతం పన్ను విధించడం గమనార్హం. తాజా నిర్ణయంతో భారత్‌ కూడా బ్రిటన్‌ బాటలో నడిచినట్టయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం అనంతరం ఐరోపా సమాఖ్య రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులను తగ్గించుకోవడం మొదలు పెట్టింది. దీన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ మంచి అవకాశంగా భావించాయి. ఐరోపా, అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా గణనీయమైన లాభాలను ఆర్జిస్తున్నాయి. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న ముడి చమురును దిగుమతి చేసుకుని ఇక్కడ ప్రాసెస్‌ చేసి, ఎగుమతి చేస్తుండడం గమనార్హం. దీంతో ఎగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం పన్నులు విధించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) 5.7 మిలియన్‌ టన్నుల డీజిల్, 2.5 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ దేశం నుంచి ఎగుమతి అయింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ దేశీయంగా పెట్రోల్‌ పంపులు నిర్వహిస్తున్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు. ఆయిల్‌ మార్కెటింగ్‌లో 90 శాతం వాటా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిటైల్‌ విక్రయ ధరలను సవరించకుండా కొంత కాలంగా నియంత్రణ పాటిస్తున్నాయి. 

దీంతో పీఎస్‌యూల మాదిరే తక్కువ రేట్లకు పెట్రోల్‌ ఉత్పత్తులను విక్రయించడం వల్ల భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందంటూ రిలయన్స్, నయారా ఎనర్జీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల మాదిరి తక్కువ రేట్లకు విక్రయించకపోతే అవి మార్కెట్‌ వాటాను నష్టపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అవి స్థానిక విక్రయాలను తగ్గించుకుని కొంత మేర ఎగుమతులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 
భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.. 

‘‘ఇటీవలి కాలంలో క్రూడ్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను విధిస్తున్నాం’’అని ఆర్థిక శాఖ తెలిపింది. నూతన లెవీ అన్నది చమురు కంపెనీలు పొందుతున్న ధరలో 40 శాతానికి సమానమని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 మిలియన్‌ బ్యారెళ్ల కంటే తక్కువ ఉత్పత్తి చేసిన సంస్థలకు ఈ పన్నును మినహాయించినట్టు తెలిపింది.  

కళ్లు చెదిరే లాభాలు.. 
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర ప్రస్తుతం 112 డాలర్ల స్థాయిలో ఉంది. లోగడ ఇది 139 డాలర్లకూ వెళ్లింది. ఫలితంగా ఓఎన్‌జీసీ 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.40,306 కోట్ల లాభం ఆర్జించింది. ఆయిల్‌ ఇండియా రూ.3,887 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 

ఎగుమతులతో అద్భుత లాభాలు 
దేశీ సరఫరాలను పణంగా పెట్టి ఎగుమతి చేయడం ద్వారా కొన్ని ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలు అద్భుత లాభాలు గడిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీనివల్లే పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌పై ఎగుమతి పన్ను విధించాల్సి వచ్చినట్టు చెప్పారు. ఎగుమతి పన్నుతోపాటు, దేశీయ ఉత్పత్తిపై విధించిన విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించి, అవసరమైతే మార్పులు చేస్తామని తెలిపారు. ప్రైవేటు తయారీ సంస్థలు ఎగుమతులపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయని, దీంతో దేశీయ సరఫరా పెంచేందుకు కొత్త పన్నును లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించారు. లాభాలు పెంచుకునే సంస్థల పట్ల తాము కక్ష సాధించడం లేదని స్పష్టం చేశారు.

ఎగుమతులపైనా పరిమితులు..
ఒకవైపు పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై పన్ను విధించిన కేంద్ర సర్కారు.. మరోవైపు ఎగుమతుల పరిమాణంపై పరిమితులు విధించింది. దేశీయంగా వీటి అందుబాటు పెంచడమే ఈ చర్యల ఉద్దేశ్యం. 2023 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి చేసే పెట్రోల్‌ పరిమాణంలో సగం మేర దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అదే డీజిల్, గ్యాస్‌ అయితే ఎగుమతి పరిమాణంలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలని ఆర్థిక శాఖ పరిమితి పెట్టింది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ మరింత అందుబాటులోకి వస్తుంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల పెట్రోల్‌ పంపులు ఎప్పుడూ నో స్టాక్‌ బోర్డుతో దర్శనమిస్తున్నాయి. కేంద్రం పెట్టిన పరిమితులతో ఇకమీదట ఈ పరిస్థితి ఉండదు. భూటాన్, నేపాల్‌ దేశాలకు ఎగుమతులను ఈ నిబంధనల పరిధి నుంచి మినహాయింపు కల్పించింది. అలాగే, నూరు శాతం ఎగుమతి ఆధారిత యూనిట్లు, సెజ్‌లలోని యూనిట్లకు ఎగుమతుల పరిమాణం పరిమితులు వర్తించవు. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏ రిఫైనరీ అయినా కానీ, ఎగుమతులపై పన్ను ఒకే విధంగా అన్నింటికీ అమలవుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ స్పష్టం చేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో రెండు రిఫైనరీలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement