పెట్రో మంటలు | Diesel hits record high, petrol at three-year peak | Sakshi
Sakshi News home page

పెట్రో మంటలు

Published Wed, Jan 17 2018 3:25 AM | Last Updated on Wed, Jan 17 2018 7:42 AM

 Diesel hits record high, petrol at three-year peak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అవి పైసలే.. రోజూ కొన్ని పైసలే.. అసలు మనం లెక్కలోకి తీసుకోని పైసలే.. కానీ పైసలు పైసలు కలసి రూపాయలై బండెడు బరువుగా మారిపోయాయి. దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేసి, రోజువారీగా మార్చే విధానం అమలు చేసినప్పటి నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్‌) ధరలు తగ్గినా దేశంలో ధరలు తగ్గించకుండా పన్నులు పెంచుతూ సమానం చేయడం.. ధరలు పెరిగితే మాత్రం పెంచుకుంటూ వెళ్లడం.. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లుగా పన్నులు వేస్తూ పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్‌ ధర అయితే దేశంలోనే అత్యధికంగా ఉండడం గమనార్హం. పెట్రోల్, డీజిల్‌ ధరలు మండిపోతుండడంతో.. బండి బయటికి తీద్దామంటే భయమేస్తోందని వాహనదారులు వాపోతున్నారు.  


 
నొప్పి తెలియకుండా.. 
చమురు సంస్థలు గతంలో ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్, డీజిల్‌ల ధరలను సవరించేవి. అలా చేసినప్పుడు ఒక్కోసారి రెండు మూడు రూపాయల వరకు పెంపు ఉండేది. దాంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమయ్యేది. దీంతో ప్రభుత్వం గతేడాది జూన్‌ 16 నుంచి రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. నామమాత్రంగా తొలి 15 రోజుల పాటు ధరలు తగ్గించగా... ఆ తర్వాతి నుంచి మెల్లమెల్లగా మోత మొదలైంది. హైదరాబాద్‌లో గతేడాది జూలై 16న రూ.67.11గా ఉన్న లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.75.47కు.. డీజిల్‌ ధర రూ.60.67 నుంచి రూ.67.23కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.92కు, డీజిల్‌ ధర రూ.68.79కు చేరాయి. 
 
సగానికిపైగా మోత పన్నులతోనే.. 
పెట్రోల్, డీజిల్‌ అసలు ధరలకు.. వినియోగదారుడికి చేరేవరకు ఉన్న ధరలకు అసలు పోలికే లేదు. ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న ధరలో సగానికిపైగా కేంద్ర రాష్ట్రాల పన్నులు, సుంకాలే ఉండడం గమనార్హం. దీనికితోడు దాదాపు రెండేళ్ల కింద అంతర్జాతీయంగా చమురు ధరలు బాగా తగ్గాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్రోల్, డీజిల్‌ల ధరలు తగ్గించకుండా.. సుంకాలు పెంచి ధరల వ్యత్యాసాన్ని సొమ్ము చేసుకుంది. అలా రెండు మూడు సార్లు సుంకాలు పెంచింది. తర్వాత పెట్రోల్, డీజిల్‌ల ధరలను కూడా కొద్దిగా తగ్గించింది. అయితే కొద్ది నెలలుగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దాంతో దేశంలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుకుంటూ వస్తున్నారు. పెంపుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడంతో రోజువారీ ధరల సవరణ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా తరచూ పది పన్నెండు పైసలు పెంచడం, నాలుగైదు పైసలు తగ్గించడం చేస్తూ.. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ధరలు బాగా పెంచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ డ్యూటీ కింద ఒక్కో లీటర్‌ పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 వసూలు చేస్తోంది. ఈ పన్ను తర్వాతి మొత్తం ధరపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ పన్ను మోత మోగిస్తున్నాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కలిపి పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం భారం పడుతున్నట్లు అంచనా. 
 
రెండో స్థానంలో తెలుగు రాష్ట్రాలు 
పెట్రోల్‌ ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్, అదనపు సుంకాల విధింపులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి. మహారాష్ట్ర పెట్రోల్‌పై 26 శాతం వ్యాట్‌తో పాటు ప్రతి లీటర్‌పై రూ.9 చొప్పున అదనపు సుంకం వసూలు చేస్తోంది. దీంతో పెట్రోల్‌పై పన్ను 43.71 శాతంగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌కుతోడు ప్రతి లీటర్‌పై రూ.4 అదనపు సుంకం వసూలు చేస్తున్నారు. దీంతో పన్ను 38.82 శాతానికి చేరింది. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.4 సుంకంతో పన్నుశాతం 30.71కి చేరింది. తెలంగాణలో పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఢిల్లీలో పెట్రోల్‌పై పన్ను 27 శాతం ఉండగా.. గోవాలో అతి తక్కువగా 17 శాతం మాత్రమే ఉన్నాయి. 
 
ఇక ముందు బాదుడే! 
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, చమురు ఉత్పత్తి దేశాలు క్రూడాయిల్‌ ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం నేపథ్యంలో.. ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రస్తుతం ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ (బ్యారెల్‌) ధర రూ.4,085గా ఉంది. ఒక బాస్కెట్‌లో 159 లీటర్ల చమురు ఉంటుంది. దానిని రిఫైనరీల్లో శుద్ధి చేసి.. పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లతో పాటు ఇతర ఉత్పన్నాలను వేరుచేస్తారు. వాటిని వేర్వేరు ధరలతో విక్రయిస్తారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌ల ఉత్పత్తి ఖర్చులు మాత్రం ప్రస్తుతమున్న ధరల్లో దాదాపు సగం మాత్రమే ఉంటాయి. మిగతాదంతా పన్నుల భారమే. 
 
జీఎస్టీలోకి చేర్చితే తగ్గుతాయా? 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినా.. పెట్రోలియం ఉత్పత్తులను అందులో చేర్చలేదు. రాష్ట్రాలకు దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండడంతో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అదే జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకువస్తే ద్వంద్వ పన్నుల భారం తగ్గి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 

అడ్డగోలు పన్నులు తగ్గించాలి 
‘‘పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి మరీ ఎక్సైజ్, అమ్మకం పన్ను వసూలు చేస్తున్నాయి. అందువల్లే పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఖజానా నింపేందుకు ప్రజలపై పన్ను పోటు వేయడం తగదు. జీఎస్టీ పరిధిలోకి చేర్చితే ధరలు దిగివస్తాయి..’’  – రియాజ్‌ ఖాద్రీ, ట్యాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ 

పైసలు తగ్గిస్తూ.. రూపాయల్లో పెంచుతున్నారు 
‘‘అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు తగ్గినా ఇక్కడ తగ్గించడం లేదు. పెరిగినప్పుడు మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. అప్పుడప్పుడు పైసలు మాత్రమే తగ్గిస్తూ.. పెంచినప్పడు రూపాయల్లో బాదుతున్నారు.. ఇలాగైతే ఎలా..?’’  – సతీష్‌ దేవ్‌కట్, మిట్టికాషేర్‌ (16సీహెచ్‌ఎం22) 

డ్రైవింగ్‌ ఫీల్డ్‌ వదిలేద్దామనిపిస్తోంది.. 
‘‘పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలను చూస్తే భయమేస్తోంది. రోజంతా పనిచేసినా తగిన ఫలితం లేదు. వాహనాన్ని క్యాబ్‌ లింకులో పెట్టాను. ఎక్కడ ఆర్డర్‌ వస్తే అక్కడికి పోవాల్సిందే. బండి ఫైనాన్స్‌లో ఉంది కాబట్టి తిరగక తప్పడం లేదు. ఫీల్డ్‌నే వదిలేయాలనిపిస్తోంది..’’ – యూనస్, తార్నాక (16టీఏఆర్‌73)  

వాహనదారులపై మోయలేని భారం 
‘‘ప్రతి ఒక్కరు ఏదో ఒక వాహనాన్ని వినియోగించక తప్పని పరిస్థితి. ఇలా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుకుంటూ పోతే మోయలేని భారం పడుతోంది. ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి..’’  – శ్రీకాంత్‌రెడ్డి, నానక్‌రాంగూడ (16జీసీబీ44పి–160054)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement