మా విషయంలో పవన్ ప్రశ్నిస్తారని భావిస్తున్నాం
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలోని మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు గ్రామాల రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. శనివారం మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకువచ్చారు.
ఫ్యాక్టరీ వద్దని, తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు పవన్ను కోరారు. ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రెండున్నరేళ్లుగా ఉద్యమం చేస్తున్నామని, అన్యాయం గురించి ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, పిల్లలు, మహిళలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రైతుల భూములు లాక్కొంటున్నారని, రైతులు వలస పోయే పరిస్థితి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల గొంతేరు కాలువ విషతుల్యమవుతుందని, లక్షలాదిమంది పొట్ట కొడుతున్నారని చెప్పారు. తమ విషయంలో పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అనుకుంటున్నామని, తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరారు.