నేడే జిల్లాల ముసాయిదా
తుది మెరుగులు దిద్దిన రాష్ట్ర సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో కీలకమైన ఘట్టం ముగిసిం ది.మొత్తం 27 జిల్లాలతో పునర్విభజన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించిన మేరకు సోమవారం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ అధికారులు జిల్లాల ముసాయిదాకు తుది మెరుగులద్దారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో కూడిన జిల్లాల జాబితాను రూపొందించారు.
భేటీ కంటే ముందు రూపొందించిన ముసాయిదా ప్రతిలో స్వల్ప మార్పులు చేశారు. మంత్రుల సలహాలు, సూచనలతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసులతో కొన్ని మండలాలను పక్కనున్న జిల్లాల్లో సర్దుబాటు చేశారు. దీంతో జిల్లాల వారీగా ప్రతిపాదించిన మండలాల సంఖ్యలో హెచ్చు తగ్గులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు తొలి ముసాయిదా ప్రకారం వరంగల్ జిల్లాలో.. హన్మకొండలో 14, వరంగల్‌లో 14, భూపాలపల్లిలో 16 మండలాలకు చోటు దక్కింది. చివరకు హన్మకొండలో 18, వరంగల్‌లో 17జిల్లాలు, భూపాలపల్లిలో 15 మండలాలతో తుది ముసాయిదా సిద్ధమైంది. తొలుత హన్మకొండ జిల్లాలో ఉన్న హాసన్‌పర్తి మండలాన్ని చివరికి పక్కనున్న వరంగల్ జిల్లాలో చేర్చారు. యాదాద్రి జిల్లాలో ప్రతిపాదిత దేవరుప్పుల మండలాన్ని
హన్మకొండలో కలిపారు. జయశంకర్(భూపాలపల్లి) జిల్లాలో చేర్చిన శాయంపేట మండలాన్ని వరంగల్‌లో చేర్చారు. కొన్ని జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన కొత్తగా రెవె న్యూ మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిపాదిత జిల్లాల స్వరూపం కాస్తా అటుదిటుగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేయనున్న పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ముఖచిత్రం మారిపోనుంది. తొలుత 74 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జనాభా ప్రాతిపదికన ఈ సంఖ్యను 31కి కుదించింది. దీంతో మొత్తం మండలాల సంఖ్య 490కి చేరింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల అనంతరం 30 రోజుల వ్యవధిలో ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, అర్జీలను స్వీకరిస్తారు. గడువులోగా వచ్చిన అర్జీలన్నీ పరిశీలించి జిల్లాల తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మొత్తంగా ఈ ప్రక్రియను సెప్టెంబరు 30 లోగా పూర్తి చేసి.. అక్టోబర్‌లో దసరా పండుగ నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేలా సన్నాహాలు మొదలయ్యాయి.
డబుల్.. ట్రిపుల్ రోల్ ఎమ్మెల్యేలు
పునర్విభజనతో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రెండు మూడు ముక్కలవుతున్నాయి. రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వెళ్తున్నాయి. దీం తో తమకు ఓటు బ్యాంకు ఉన్న మండలాలు వేర్వేరు జిల్లాలుగా మారితే ఎన్నికల సమయంలో ఆపసోపాలు పడాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళన చెందుతున్నా రు. కొందరు ఆఖరి రోజున తమకు పట్టున్న మండలాలను.. తమకు అనువైన జిల్లాల్లో ఉంచేలా ఒత్తిడి పెంచారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పది జిల్లాల్లో విస్తరించిన ఈ సెగ్మెంట్లు ఇప్పుడు 27 జిల్లాల పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాలు ఏకంగా మూడు జిల్లాలు, కొన్ని రెండు జిల్లాల్లో కలుస్తాయి. దీంతో అక్కడి ఎమ్మెల్యేలు డబుల్.. ట్రిపుల్ రోల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
సీఎం రెండు జిల్లాల ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం అటు మెదక్ జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో చేరుతోంది. దీంతో ఆయన రెండు జిల్లాలకు ఎమ్మెల్యే పాత్ర పోషిస్తారు. మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్ నియోజకవర్గాల పరిధితో సంబంధం లేకుండా కొత్త జిల్లాలకు రూపకల్పన చేయటంతో కొత్త రాజకీయ చిత్రం ఆవిష్కృతం కానుంది.
రెండు జిల్లాల్లో ఉండే నియోజకవర్గాలివే..
ఆసిఫాబాద్, హుజురాబాద్, స్టేషన్ ఘన్‌పూర్, వర్ధన్నపేట, చొప్పదండి, వేములవాడ, మంథని, ములుగు, బాన్సువాడ, మానకొండూరు, సిరిసిల్ల, దేవరకద్ర, మక్తల్, ఆందోల్, దుబ్బాక, గజ్వేల్, నారాయణఖేడ్, నర్సాపూర్, కొల్లాపూర్, మునుగోడు, నకిరేకల్, నర్సాపూర్, తుంగతుర్తి, పాలకుర్తి, భూపాలపల్లి మూడు జిల్లాల్లో ఉండే సెగ్మెంట్లు: ఖానాపూర్, హుస్నాబాద్, జనగాం, ఇల్లందు.
కొత్త రెవెన్యూ మండలాలు
ఆదిలాబాద్- 2: మావుల, నస్‌పూర్,
కరీంనగర్-3: కొత్తపల్లి, అంతర్గాం,
బొమ్మకల్ (కరీంనగర్ రూరల్)
వరంగల్-5: ఖిలా వరంగల్, కాజీపేట,
ఐనవోలు, చిల్పూరు, వేలేరు
నల్లగొండ-3: కొండ మల్లేపల్లి, తిరుమలగిరి సాగర్, మాడుగులపల్లి
ఖమ్మం-1: రఘునాథపాలెం
మహబూబ్‌నగర్-6: రాజాపూర్, మరికల్, నందిన్నె, పగర, అమరచింత,
మహబూబ్‌నగర్ రూరల్
మెదక్-3: గుమ్మడిదల, సిర్గాపూర్,
నారాయణ్‌రావుపేట (సిద్దిపేట రూరల్)
నిజామాబాద్-2: నిజామాబాద్ నార్త్,
నిజామాబాద్ రూరల్
రంగారెడ్డి-6: దుండిగల్, జవహర్‌నగర్, గండిపేట, సరూర్‌నగర్, అబ్దుల్లాపూర్, బాలాపూర్