
పాన్ కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు
కాచిగూడ: పాన్ తెచ్చుకుందామని వెళ్లిన ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాచిగూడ ఇన్స్‌పెక్టర్ డి.రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కార్వాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా (58) మటన్ వ్యాపారం చేస్తుంటాడు. శనివారం ఉదయం మటన్ తెచ్చేందుకు స్కూటర్‌పై చెంగిచెర్లకు వెళ్లి తిరిగి వస్తుండగా కాచిగూడ నింబోలిఅడ్డ చౌరస్తాలో స్కూటర్‌ను రోడ్డుపక్కన ఆపి, ఎదురుగా ఉన్న పాన్‌షాపులో పాన్ తెచ్చుకునేందుకు వెళుతుండగా యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.