ఉప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో యువకుడి చేతులు వెనుకకు విరిచి తాళ్లతో బంధించిన దృశ్యం.
ఉప్పల్ (హైదరాబాద్): ఉప్పల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఓ యువకుడు చేతులు వెనుకకు విరిచి తాళ్లతో బంధించి ఉండగా... ఆ దృశ్యాన్ని చూసి స్టేషన్‌కు వచ్చిన వారు ఆవేదనకు గురయ్యారు. శనివారం గుర్తు తెలియని వ్యక్తి మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కడానికి గమనించిన అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని తాళ్లతో బందించి తీసుకొచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించి వెళ్లారు. ఆ యువకుడు ఒంటి నిండా గాయాలతో ఆదివారం ఉదయం నుంచి మండుటెండలో దాహం దాహం అంటూ అరుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
యువకుడు హిందీలో ఆకలి, దాహం వేస్తుందన్న మాట తప్ప మరేది మాట్లాడలేదు. పోలీసులను దీనిపై అడగ్గా... మతిస్థిమితం లేని ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడు. శనివారం సాయంత్రం మెట్రో రైలు పట్టాల వద్దకు వెళ్లాడని... అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని వచ్చి ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పారన్నారు. అప్పటికే ఆ యువకుని ఒంటి నిండా గాయాలున్నాయని విచారించిన అనంతరం వదిలేశామని చెప్పారు.