
మెట్రో మహల్స్
మెట్రో ప్రాజెక్టులో మరో విశేషం చోటుచేసుకుంది.
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో ప్రాజెక్టులో మరో విశేషం చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్న మెట్రో మాల్స్‌తో వివిధ ప్రధాన రహదారులు తళుకులీనబోతున్నాయి. పంజగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ ప్రాంతాల్లో సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ మాల్స్‌తో నగరంసింగపూర్ తరహా అందాలు సంతరించుకుంటుందని భావిస్తున్నారు. ఈ మాల్స్‌తో ఐటీ, బీపీఓ, కేపీఓ వంటి బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. రాబోయే పదేళ్లలో మాల్స్ సంఖ్య 12కు చేరుకోనుందనిమెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టులో ప్రతి అంశం విశేషంగా మారింది. భారీ మెట్రో మాల్స్ నిర్మాణం, స్టేషన్లలో ఏర్పాటు కానున్న దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, వాణిజ్య ప్రకటనలపై అందరి దృష్టి పడింది. కొంగొత్త హంగులతో రూపుదిద్దుకోనున్న వాటి కథాకమామీషు ఇదిగో..
నగరానికి నయా లుక్
మెట్రో ప్రాజెక్టులో భారీ మాల్స్ నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పంజ గుట్ట వద్ద 50 వేల చదరపు అడుగులు, హైటెక్‌సిటీ వద్ద 20 వేల చదరపు అడుగులు, ఎర్రమంజిల్ వద్ద 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా మెట్రో మాల్స్ సిటీజన్లకు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే పదేళ్లలో ఉప్పల్ మెట్రో డిపో, మూసారాంబాగ్, మలక్‌పేట్, ఎల్బీనగర్, ఎర్రమంజిల్, బేగంపేట్, రాయదుర్గం, అమీర్‌పేట్, బాలానగర్, మియాపూర్ మెట్రో డిపోల వద్ద కూడా భారీ వాణిజ్య మాల్స్‌ను మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ నిర్మించనుంది. మొత్తంగా 18.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య, రియల్ ఎస్టేట్ స్థలాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ మాల్స్‌లో ఆఫీస్ స్పేస్, రిటైల్ స్టోర్లు, బహుళజాతి కంపెనీలు, ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల కార్యాలయాలు, హోటళ్లు, హెల్త్‌కేర్ సెంటర్లు, పాలిక్లినిక్స్, రిటైల్ స్టోర్లు, బ్రాండెడ్ వస్త్రాల దుకాణాలు, మల్టిప్లెక్స్‌లు ఏర్పాటు కానున్నాయి. కాగా మెట్రో మాల్స్ నిర్మాణానికి చదరపు అడుగుకు సుమారు రూ.4 వేలు వ్యయం అవుతోందని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చదరపు అడుగుకు నెలవారీగా రూ.50 నుంచి 150 వరకు అద్దె ఉంటుందన్నారు.
వాణిజ్య ప్రకటనలు ఇలా..
కాదేదీ వాణిజ్య ప్రకటనలకు అనర్హం అన్న చందంగా మెట్రో రైళ్లకు లోపల, బయట, స్మార్ట్ కార్డుల వెనకాల, స్టేషన్ల బయట, లోపల, మెట్రో పిలర్లు, పోర్టల్స్, వయాడక్ట్‌లపై ఆసక్తిగల సంస్థలు వాణిజ్య ప్రకటనల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ఆయా స్థలాలను అద్దె కిచ్చేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. వాణిజ్య ప్రకటనల ద్వారా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సుమారు 5 శాతం ఆదాయాన్ని దశలవారీగా రాబట్టుకోవాలని యోచిస్తోంది. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్‌లు, బోర్డుల ఏర్పాటుకు భారతీయ మహిళా బ్యాంక్, హెచ్‌పీ, కియోలిస్, థేల్స్, మిత్సుబిషి ఎలక్ట్రిక్, ఓస్లో, ఓటీఐఎస్, ఫీడ్‌బ్యాక్ ఇన్‌ఫ్రా, ఏఈకామ్ వంటి సంస్థలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీతో ఒప్పందాలు కదుర్చుకున్నాయి. వాణిజ్య ప్రకటనలకు అద్దెలు ప్రాంతాన్ని బట్టి, మార్కెట్ డిమాండ్‌ను బట్టి మారుతుంటాయన్నారు.
టేషన్లలో ఏముంటాయంటే..
-నాగోల్- రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాల్లో మొత్తం 72 కి.మీ మార్గంలో 64 ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించనున్నారు.
- 64 స్టేషన్లలో మొత్తం 4.50 లక్షల చదపు అడుగుల విస్తీర్ణంలో పలు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
- 55 స్టేషన్లు నిర్మాణ పరంగా అత్యంత క్లిష్టమైనవి. వీటిలో ఒక్కో స్టేషన్‌లో 2500 నుంచి 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
- స్టేషన్‌లోనికి ప్రవేశించే మార్గం, వెలుపలికి వచ్చే మార్గాల్లో మరో వెయ్యి నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలోనూ రిటైల్ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
- స్టేషన్లలో ప్రతి దుకాణం విస్తీర్ణం 100 నుంచి 2500 చదరపు అడుగుల విస్తీర్ణం వరకు ఉంటాయి.
- అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్‌ల వద్ద ఏర్పాటు కానున్న ఇంటర్ చేంజ్ (రెండు కారిడార్లు కలిసే చోటు) స్టేషన్లు, హైటెక్‌సిటీ, పంజ గుట్ట, రాయదుర్గం, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో ఒక్కో స్టేషన్‌లో సుమారు పది వేల నుంచి 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలం అందుబాటులో ఉంటుంది. తొలుత వచ్చినవారికే దుకాణం ఏర్పాటుకు అవకాశం ఇస్తారు.
- స్టేషన్లలో ఏర్పాటు చేసే దుకాణాల్లో నిత్యవసర సరుకులు, పండ్లు, కూరగాయలు, లాండ్రీ, పుస్తకాలు, కాఫీషాపులు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్, పిజ్జా, బర్గర్ దుకాణాలు ఏటీఎంలు, మొబైల్ రీచార్జి కార్డులు, సర్వీ సింగ్ సెంటర్లు, మెడికల్ షాపులుంటాయి.
- మొత్తం 65 స్టేషన్లలో మెడ్‌ప్లస్ సంస్థ మందుల దుకాణాలు ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పటికే స్టేషన్లలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య స్థలాలను అద్దెకిచ్చినట్టు ఎల్‌అండ్‌టీ వర్గాలు తెలిపాయి.
- నాగోల్-మెట్టుగూడ, మియాపూర్-ఎస్.ఆర్‌నగర్ రూట్లలో ఏర్పాటు కానున్న స్టేషన్లలో స్థలానికి భారీగా గిరాకీ ఉన్నట్లు తెలిపారు.
- ప్రస్తుతం రాయదుర్గం, పంజ గుట్ట, హైటెక్‌సిటీ, బేగంపేట్ మెట్రో స్టేషన్లలో దుకాణాల ఏర్పాటుకు పోటీ అధికంగా ఉందని ఇక్కడ చదరపు అడుగుకు సుమారు రూ.450 నెలసరి అద్దె ఉండనుంది.
- స్టేషన్‌లో దుకాణం నెలకొల్పేవారు స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ప్రతి చదరపు అడుగుకు నెలవారీగా కనిష్టంగా రూ.90 నుంచి గరిష్టంగా రూ.450 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
షాప్ ఏర్పాటు చేయాలంటే..
- ఫర్మ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫర్మ్ పాన్‌కార్డు, టిన్ నెంబరు, బ్యాంక్ కరెంట్ అకౌంట్, సంబంధిత రంగంలో అనుభవం, అర్హత ఉన్నవారు హైటెక్‌సిటీ వద్దనున్న ఎల్‌అండ్‌టీ సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
- ఇప్పటివరకు మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాలు అద్దెకు తీసుకున్న ప్రముఖ కంపెనీలు: డొమినోస్, పోలిటస్, మెడ్‌ప్లస్, అమూల్, ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలు.