32 ప్రాంతాల్లో మెట్రో పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారుకావడంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల అవసరాలకు తగినట్లు వసతులు కల్పించే అంశంపై దృష్టి సారించింది. సమీప కాలనీలు, ముఖ్య ప్రాంతాల నుంచి ఆయా మెట్రో స్టేషన్లకు చేరుకునే వాహనచోదకులు తమ వ్యక్తిగత వాహనాలను నిలిపేందుకు వీలుగా మొత్తం 64 స్టేషన్లకుగాను 32 చోట్ల పార్కింగ్ సముదాయాలు ఏర్పాటు చేయనుంది. దీనికోసం 17 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించనుంది.
మరో 15 ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. తొలిదశలో నాగోల్– అమీర్‌పేట్, మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో ఏడు పార్కింగ్ లాట్లు, మరో 6 చోట్ల పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేయనున్నట్లు హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
