కశ్మీర్ వరకు ఎంఐఎం విస్తరణ: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో ముస్లింల పక్షాన గళం విప్పే ఏకైక రాజకీయ పక్షం మజ్లిస్ పార్టీ అని, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక రాష్ట్రా లే కాదు, కశ్మీర్‌కు కూడా వెళ్తాం’ అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం పార్టీ 58వ వార్షికోత్సవం సందర్భంగా దారుస్సలాంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో అందరి దృష్టి మజ్లిస్‌పై ఉందని, ముస్లింల పక్షాన గళం విప్పేందుకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పార్టీని విస్తరిస్తామని తెలిపారు. ముస్లింలపట్ల అన్యాయాలపై నిలదీస్తున్న ఒవైసీ బద్రర్స్‌ను ఆయా రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా పలువురు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మోదీ పాలనలో అచ్ఛేదిన్ ఎలా సాధ్యమని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ బీజేపీతో మిలాఖత్ అయిందని ప్రచారం జరగడం దురదృష్టకరమని, బాబ్రీ మసీదు విధ్వంసకులతో చేతులు కలుపడమా? జరిగే పనికాదని ఆయన తేల్చి చెప్పారు. పదవులంటే వ్యామోహం లేదని, వీపీ సింగ్ హయాంలో హోంమంత్రి పదవి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించిన ఘనత మజ్లిస్‌కే దక్కుతుందన్నారు. ముస్లింలు దళితుల కంటే దుర్భర జీవితం గడుపుతున్నారనే విషయాన్ని సచార్, రంగానాథ్ మిశ్రా కమిటీల నివేదికలు స్పష్టం చేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్యాక్రాంతంమైన వక్ఫ్‌భూముల స్వాధీనం కోసం పోరాడుతామన్నారు.