దాడులు.. దౌర్జన్యాలు | MIM Leaders and Supporters hulchul in old city due to GHMC Elections | Sakshi
Sakshi News home page

దాడులు.. దౌర్జన్యాలు

Published Wed, Feb 3 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM

లంగర్ హౌజ్ లో గాయపడిన బీజేపీ కార్యకర్త, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వాహనంపై దాడి చేసి కారు అద్దాలు పగలుకొట్టిన మజ్లిస్ కార్యకర్తలు

లంగర్ హౌజ్ లో గాయపడిన బీజేపీ కార్యకర్త, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వాహనంపై దాడి చేసి కారు అద్దాలు పగలుకొట్టిన మజ్లిస్ కార్యకర్తలు

గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన మజ్లిస్
 
 

  •  ‘మూడు పార్టీల’పై ఎంఐఎం కార్యకర్తల వరుస దాడులు
  •  రణరంగంగా మారిన పాతబస్తీ
  •  ఉత్తమ్ కారు అద్దాలు ధ్వంసం.. షబ్బీర్‌పై పిడిగుద్దులు
  •  ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటి ముట్టడి..
  •  ఆయన కుమారునిపై దాడికి యత్నం
  •  జంగంమెట్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ దాడి
  •  వ్యూహాత్మక వైఖరి అనుసరించడంలో పోలీసుల వైఫల్యం

 
 
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల సందర్భంగా మజ్లిస్ పార్టీ రెచ్చిపోయింది. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మంగళవారం పాతబస్తీతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో దుందుడుకు స్వభావంతో ఉద్రిక్తతలకు కారణమైంది. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరి పైనా కాలుదువ్వింది. ఎంఐఎం పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి ప్రముఖులపైనా పిడిగుద్దులతో దాడులకు పాల్పడ్డారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు స్వయంగా దాడులు, బెదిరింపుల్లో పాల్గొన్నారు. కాగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం, మజ్లిస్‌ను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 ఠాణా పైనే దాడికి దిగిన ఎంఐఎం..
ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ మధ్య ఆది నుం చీ నువ్వానేనా అనే పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ నేపథ్యంలో జలాల్‌కుంట ప్రాంతంలో ఎదురైన ఇరు వర్గాలు పరస్పరం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవడం, గౌస్‌పై ఖాద్రీ దాడికి యత్నించడంతో వివాదం చెలరేగింది. దీంతో ఎమ్మెల్యేతో పాటు గౌస్‌ను అరెస్టు చేసిన పోలీ సులు మీర్‌చౌక్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
 
పాషా ఖాద్రీని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మీర్‌చౌక్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఇరువురూ.. తమ సొంత పూచీకత్తుపై గౌస్‌ను తీసుకుని బయలుదేరారు. మరోవైపు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీర్‌చౌక్ ఠాణాకు వచ్చారు. ప్రధాన గేటును తన్నుకుంటూ లోపలకు వెళ్లిన ఆయన పోలీసుస్టేషన్‌లో బీభత్సం సృష్టిం చారు. ఖాద్రీతో పాటు అరెస్టైన ఇద్దరు ఎంఐ ఎం కార్యకర్తల్ని బలవంతంగా అక్కడ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో పోలీసులు చేసిన విజ్ఞప్తినీ ఎంపీ పట్టించుకోకపోవడంతో వారు మిన్నకుండిపోయారు.
 
ఉత్తమ్ వాహనం, షబ్బీర్‌పై దాడి..
తమ అనుచరుల్ని తీసుకువెళ్తున్న ఓవైసీ బృందానికి పురానాపూల్ ప్రాంతంలో గౌస్‌తో వెళ్తున్న ఉత్తమ్ వాహనం ఎదురైంది. దీంతో విచక్షణ కోల్పోయిన ఎంఐఎం కార్యకర్తలు అసద్ సమక్షంలోనే పీసీసీ చీఫ్ వాహనంపై కర్రలతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఓవైసీ వాహనం ముందు భాగంలో ఎడమ వైపు నిల్చుని ఉండగా.. వెనుక సీటులో కుడివైపు కూర్చున్న షబ్బీర్‌పై ఆ పార్టీ కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించారు. దాదాపు ఎనిమిదిసార్లు దాడి చేయడంతో ఆయన కంటితో పా టు పలు చోట్ల గాయాలయ్యాయి. దీంతో రం గంలోకి దిగిన పోలీసులు షబ్బీర్‌పై దాడి చేసిన వ్యక్తుల్ని అరెస్టు చేయడంతో పాటు లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తల్నీ చెదరగొట్టారు.
 
విక్రమ్‌గౌడ్‌పై దాడికి యత్నం..
జాంబాగ్ డివిజన్ పరిధిలోని సుభాన్‌పుర పోలింగ్ స్టేషన్‌లో ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమ్‌గౌడ్ తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. మజ్లిస్ కార్యకర్తలు విక్రమ్‌గౌడ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టాయి.

మరోవైపు రెడ్‌హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయేషా ఫర్హాన్‌ను ఎంఐఎం నేత షకీల్ రంగారెడ్డి జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం వద్ద కత్తితో బెదిరించారని, ఫర్హాన్ ప్రాధేయపడినా పోలీసులు స్పందించలేదనే విమర్శలున్నాయి. యాకత్‌పుర పరిధిలోని కూర్మగూడ పోలింగ్ బూత్‌లో బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ సాయిప్రణీత్, సమీష్, నరేందర్‌లపై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. చావ్నీ ప్రాంతంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి హన్మంతరావుపై ఎంఐఎం మాజీ కార్పొరేటర్ ముర్తుజా దాడి చేశారు. అక్బర్‌బాగ్ ప్రాంతంలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్‌పై ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు.
 
 జంగంమెట్‌లో అక్బరుద్దీన్...
చాంద్రాయణగుట్టలోని జంగంమెట్ ప్రాం తంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చిపోయారు. అక్కడి బీజేపీ అభ్యర్థి మహేందర్‌తో పాటు ఆయన భార్యపైనా అనుచరులతో కలసి దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. లంగర్‌హౌస్ ప్రాంతంలో బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై కాలుదువ్వారు.
 
వాగ్వాదానికి దిగడంతో పాటు రాళ్ల దాడులూ చేశారు. లాఠీచార్జ్ చేసిన పోలీసులు వీరిని చెదరగొట్టారు. మల్లేపల్లిలోని బూత్ నం.11, 12, రెడ్‌హిల్స్‌లోని బూత్ నం.33, పురానాపూల్, దూబ్‌బౌలిల్లో ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లను బయటకు గెంటేసి ఎంఐఎం కార్యకర్తలు రిగ్గింగ్ చేస్తున్నారనే వార్తలు కలకలం రేపాయి. నగరంలో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఎంఐఎం సహా ఇతర పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
 
డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి..
ఆజంపుర ప్రాంతంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటిపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో కలసి వెళ్లి ఈ చర్యకు పాల్పడ్డారు. ఆకస్మికంగా ఇంటిని ముట్టడించి మహమూద్ అలీ కుమారుడు ఆజం అలీపై దాడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో దాడి చేస్తుండగా డిప్యూటీ సీఎం సెక్యూరిటీ సిబ్బంది పది మంది అక్కడ నుంచి పారిపోయారు.

అక్కడకు చేరుకున్న పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిప్యూటీ సీఎం కువూరుడిపై దాడి చేశారన్న విషయుం తెలుసుకున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆజంపుర చౌరస్తాలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర సీపీ మహేందర్‌రెడ్డి తదితరులు డిప్యూటీ సీఎం ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

రిగ్గింగ్‌లను అడ్డుకుంటున్నం దుకే ఎంఐఎం ఎమ్మెల్యే తన ఇంటిపైనా తనపైనా దాడి చేశారని, ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కువూరుడు ఆజం అలీ డిమాండ్ చేశారు. ఎంఐఎం దాడులకు తాము భయపడబోమని, ఎంతటివారినైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మలక్‌పేటలోని అన్ని డివిజన్లలో ఓడిపోతామనే భయంతో ఎంఐఎం ఈ దుశ్చర్యలకు పాల్పడిందని ఆరోపించారు.
 
ఎమ్మెల్యే బలాల అరెస్టు: డీసీపీ రవీందర్
డిప్యూటీ సీఎం ఇంటిపైనా ఆయన కుమారునిపైనా దాడి కేసులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆజంపురలో డిప్యూటీ సీఎం ఇంటి ఆవరణలోనే టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. తన అనుచరులతో కలిసి దీనిపై దాడి చేసిన బలాలపై క్రిమినల్ ట్రెస్‌పాస్, విధ్వంసం, దాడి తదితర సెక్షన్ల కింద చాదర్‌ఘాట్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశాం.

ఇతర బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ఎమ్మెల్యేను బుధవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.  అయితే ఎమ్మెల్యే బలాల ను విడిపించడానికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌తో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు బొల్లారం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఎంఐఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 
దోషులను కఠినంగా శిక్షిస్తాం: నాయిని
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపైనా.. ఆయన కుమారుడు ఆజం అలీపైనా ఎంఐఎం నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను వెంటనే అరెస్ట్ చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఆజం అలీని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆటలు సాగవని, డిప్యూటీ సీఎం ఇంటిపైనే దాడి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం అక్రమాలు అడ్డుకున్నందుకే ఆజం అలీపై దాడి చేశారని, దోషులను వదిలేది లేదని చెప్పారు.
 
అనంతరం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. బోగస్ ఓట్లను అడ్డుకున్నందుకే దాడికి పాల్పడితే ఎలా? అని ప్రశ్నించారు. ఎంఐఎం దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం ఇంటిపైనా ఆయన కుమారుడు ఆజం అలీపైనా ఎంఐఎం ఎమ్మెల్యే బలాల తన అనుచరులతో దాడి చేసిన విషయం తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ మహమూద్ అలీని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement