'రాష్ట్ర మంత్రి అండతో దౌర్జన్యకాండ'
మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి
సనత్‌నగర్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అండదండలతో ఆయన అనుచరులు దౌర్జన్యకాండకు దిగుతున్నారని, అధికార పార్టీ నుంచి ఏ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ ఐటీఐ కళాశాల విద్యార్థులపై అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక నాయకులు దాడి చేశారన్న సమాచారం మేరకు మంగళవారం ఆయన కళాశాలకు విచ్చేసి విద్యార్థులను పరామర్శించారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మర్రి మాట్లాడుతూ.. నిత్యం మంత్రి తలసాని వెంట ఉండే అనుచరుడు కళాశాలకు చెందిన షట్టర్‌కు అడ్డంగా వాహనం పార్కింగ్ చేయడంతో పాటు తమకు అడ్డుగా ఉందని విద్యార్థులకు కొద్దిగా పక్కకు జరిపినంత మాత్రాన ఏడెనిమిది మంది అధికార పక్ష నాయకులతో కలిసి వచ్చి విద్యార్థులపై దాడికి దిగడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
విద్యార్థినులు, అక్కడ పనిచేసే మహిళలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం సంస్కృతి కాదన్నారు. మంత్రి వెంట తిరిగే అనుచరులే విద్యార్థులపై దౌర్జన్యానికి దిగితే మంత్రి నేరుగా వచ్చి పరామర్శించి వారి తరుపున క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారి దాడులను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఖబర్థార్ అంటూ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల నుంచి కీడు జరిగితే నేరుగా తనకు 98480 46677 ఫోన్‌నెంబర్‌లో సంప్రదించాలని, తాను వారికి అండగా నిలబడతానని స్పష్టం చేశారు.