ఆయకట్టుకు ఆయువు
► వివిధ శాఖలతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
► రికార్డు సమయంలో కాళేశ్వరం పంప్‌హౌస్‌లు పూర్తి చేయాలి
► వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా పొలాలకు నీరివ్వాలి
► శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో వ్యవహరించాలి
► సాగునీరు, మైనింగ్, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ అధికారులు,
జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన మంత్రి
► డిసెంబర్‌లో భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభించనున్న కేసీఆర్
ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అత్యంత కీలకం. భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు 123 జీవో కింద పరిహారం ఇవ్వాలి. అలా కాని పక్షంలో 2013 చట్టం కింద భూసేకరణ జరపాలి. – హరీశ్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల సత్వర పూర్తికి ప్రభుత్వ శాఖలన్నీ సంపూర్ణ సహకారం అందించాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీరందించేలా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని, చివరి ఆయకట్టు రైతుకు నీరందించాలన్న సంకల్పానికి చేదోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులతో సంబంధం ఉన్న వివిధ శాఖల ఉన్నతాధికారులతో గురువారం హరీశ్‌రావు విడివిడిగా సమీక్షించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు... కాళేశ్వరం ప్రాజెక్టు సమీక్షతో మొదలుపెట్టి, చెరువులు, భూసేకరణ, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్, చార్జీలు, మిషన్ భగీరథ, ఇసుక అవసరాలు తదితర అంశాలపై వరకు సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టుల పూర్తికి సమన్వయంతో ముందుకు సాగాలని.. కేసీఆర్ నిర్దేశించిన కోటి ఎకరాల ఆయకట్టుకు ఆయువు పోసేలా కృషి చేయాలని కోరారు.
ఏడాదిలోగా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల పూర్తి ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ఏడాదిలోగా పూర్తిచేసి.. ఆసియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయగల ఈ పంప్‌హౌజ్‌లు ఏడాదిలో పూర్తయితే సీఎం కేసీఆర్ కలసాకారం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి 2017 డిసెంబర్ కల్లా గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు తరలించాలని... ఇందుకోసం ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మైనింగ్ తదితర శాఖలు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను రెండు వారాల్లో, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పనులు నవంబర్ 15నప్రారంభించాలని ఆదేశించారు. ఈ మూడు బ్యారేజీలతో పాటు పంప్‌హౌజ్‌ల పనులను ఏకకాలంలో చేపట్టాలన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని ఇకపై ప్రతి నెలా సమీక్షిస్తానని.. ప్రాజెక్టు పనులను హైదరాబాద్ నుంచి మానిటర్ చేయడానికి ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి సీసీ కెమెరాలను ఈఎన్‌సీ కార్యాలయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు.
చెరువుల కింద రబీకి నీరు
సాగునీటి శాఖ సమీక్ష అనంతరం మంత్రి హరీశ్‌రావు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ సీజన్‌లో అన్ని చెరువుల కింద సాగునీరివ్వాలని వారిని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లా, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు మినహా తెలంగాణ అంతటా చెరువులు నిండాయని.. ఈ దృష్ట్యా ఇరిగేషన్, వ్యవసాయ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని రబీ పంటకు సాగునీటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. చెరువుల పరిధిలో సమావేశాలు పెట్టి నీటి లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేయాలని, ఎన్ని రోజులు సాగునీరు అందించగలమో ముందుగానే రైతులకు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అత్యంత కీలకమని... భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు 123 జీవో కింద పరిహారం ఇవ్వాలని, అలా కాని పక్షంలో 2013 చట్టం కింద భూసేకరణ జరపాలని సూచించారు.
విద్యుత్ సరఫరా, వ్యయంపై చర్చ
ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని డిసెంబర్ మొదటి వారంలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని హరీశ్‌రావు విద్యుత్ అధికారులతో సమీక్షలో వెల్లడించారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ సరఫరా, ఇతర ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకరరావు ఈ సందర్భంగా వివరించారు. ఇక భక్తరామదాసు ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం, దేవాదుల, అనంతగిరి, మల్లన్నసాగర్, రంగనాయకి సాగర్, మేడారం, రామడుగు ప్యాకేజీలకు విద్యుత్ సరఫరా, వ్యయం తదితర అంశాలపై భేటీలో చర్చించారు. కాళేశ్వరంలోని 6, 7, 8 ప్యాకేజీలతో పాటు మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు సబ్ స్టేషన్లు, ఇతర విద్యుత్ సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు రూ.3,300 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. అందులో 25 శాతాన్ని ఇరిగేషన్ శాఖ భరించేలా చర్యలు తీసుకోవాలని కాళేశ్వరం సీఈని మంత్రి ఆదేశించారు.
ఇసుక క్వారీలు సిద్ధం చేయండి
వివిధ సాగునీటి ప్రాజెక్టుల దగ్గర దాదాపు 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని.. దానిని నిల్వ చేసేందుకు క్వారీలను సిద్ధం చేయాలని మైనింగ్ శాఖ అధికారులకు హరీశ్‌రావు సూచించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, తుపాకుల గూడెం బ్యారేజీల ప్రాంతాలలో దాదాపు 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉందని.. అక్కడ వెంటనే పది ఇసుక రీచ్‌లు ప్రారంభించవచ్చని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో దాదాపు 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇసుక లభిస్తుందన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. ఇసుక తవ్వకం, తరలింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తే డిసెంబర్ నుంచి మేడిగడ్డ, సుందిళ్ళ , అన్నారం బ్యారేజీల పనులు వేగవంతం చేయడానికి వీలవుతుందని సూచించారు. కాగా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో సైతం హరీశ్‌రావు చర్చించారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్ని శాఖల నుంచి సంపూర్ణ సహకారం అందేలా చూస్తామని పేర్కొన్నారు.