
'జికా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు'
హైదరాబాద్: రాష్ట్రంలో జికా వైరస్ తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తన నివాసంలో మాట్లాడుతూ... పగటి పూట కుట్టే దోమ ద్వారా డెంగ్యూ తరహాలో ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు.
విమానాశ్రయాల్లో ప్రయాణికులకు ఈ వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు... వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. గర్భిణీ స్త్రీలు విదేశీ ప్రయాణాలు చేయడం ఆరోగ్యకరం కాదన్నారు. గర్భిణీలో గులియన్ బారీ సిండ్రోమ్ వంటి నాడీ సంబంధ సమస్యలు కనిపించినా.. ప్రసవాల్లో తల చిన్నగా శిశువు జన్మించినా అత్యవసర చికిత్సనందించాలని కామినేని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కమిషనర్ కెవీ సత్యనారాయణలు పాల్గొన్నారు.