'గ్లోబల్ సిటీగా హైదరాబాద్'
హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శాసనసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
భాగ్యనగరంలో నాలుగు దశల్లో ఫ్లై ఓవర్లు, స్కైవేలు, ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూసీనది వద్ద స్కైవే నిర్మాణానికి రూ. 5,916 కోట్లు, పాతబస్తీ రహదారుల అభివృద్ధికి రూ. 8,866 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్లో 19 మౌలిక వసతుల రంగాల్లో రూ. 82వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. నగర అభివృద్ధి బాధ్యత టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై ఉందని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు చెప్పారు.
రూ. 1834 కోట్లతో యాదగిరి గుట్ట అభివృద్ధి
రాష్ట్రంలో యాదగిరి గుట్టను శాస్త్రోక్తకంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని, ఇప్పటికే పదిసార్లు ఆయన గుట్టను సందర్శించారని కేటీఆర్ చెప్పారు. రూ. 509 కోట్లతో దేవాలయాన్ని, రూ. 1325 కోట్లతో టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. యాదాద్రి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 1900 ఎకరాల భూమిని రూ. 93.38 కోట్లను వెచ్చించి సేకరించినట్లు తెలిపారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.