కబ్జాదారులను వదలం
సాక్షి, సిటీబ్యూరో :‘చెరువులను కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణాలు సాగించిన అక్రమార్కులు ఎంతటివారైనా వదిలే సమస్యే లేదు. వివిధ నిర్మాణాలకు యూఎల్‌సీ అనుమతులున్నా వాటిని రద్దు చేస్తాం’ అని రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గత ప్రభు త్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం వల్లే చెరువుల ఆక్రమణలు యథేచ్ఛగా జరిగాయని, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న అధికారులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన హెచ్‌ఎండీఏ ప్రజాప్రతినిధుల కమిటీ బుధవారం జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలాలను, జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్, కూకట్‌పల్లిలోని రంగథామిని చెరువు, బోరబండలోని సున్నం చెరువులను సందర్శించి ఆక్రమణల తీరును ప్రత్యక్షంగా పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హెచ్‌ఎండీఏలో కొందరు అవినీతి అధికారుల చర్యల వల్ల పలు చెరువుల ఎఫ్‌టిఎల్‌లో అక్రమ నిర్మాణాలు రావడంతో పాటు 111 జీవో పరిధిలోని పలు జలాశయాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయన్నారు. ఇకపై కబ్జారాయుళ్లపై కఠినంగా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో హెచ్‌ఎండీఏను మరింత పటిష్టం చేసేందుకు కొత్త కమిషనర్‌ను నియమించారని తెలిపారు.
ఇదో మినీ ట్యాంక్‌బండ్ :
కూకట్‌పల్లిలోని రంగథ మిని చెరువును రూ.5కోట్ల వ్యయంతో మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని ప్రకటించారు. గతంలో 46 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రంగనాథ మిని చెరువు కబ్జా కోరల్లో చిక్కుకొని కేవలం 23 ఎకరాలే మిగిలిందని, దీన్ని సంరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నట్లు తెలిపారు. ఓ భవన నిర్మాణ సంస్థ స్థానికంగా నాలాపై నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
అలాగే 29 ఎకరాలున్న సున్నం చెరువు బడా భూకబ్జాదారుల చర్యల వల్ల 15ఎకరాలకే పరిమితమైందన్నారు. సమగ్ర నివేదిక రూపొందించాలని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఆక్రమ నిర్మాణాలకు అవకాశం లేకుండా అవసరమైన ప్రాంతాల్లో ప్రహరీ నిర్మించి, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని పటిష్టం చేయడం ద్వారా నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. బోరబండలో గతంలో కొందరికి కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు.
ఇక్కడే సర్వే.నం 18లో గల 4 ఎకరాల భూమిపై కబ్జాదారుల కన్నుపడిందనీ, వారి ఆటలు సాగకుండా ఆ స్థలంలో ఉర్దూ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. జీడిమెట్లలోని ఫాక్స్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తలసాని తెలిపారు. జవహర్‌నగర్‌లోని 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవ్వకుండా సంరక్షించేందుకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కమిటీ అభిప్రాయపడిందన్నారు.
ఇక్కడ ఇప్పటికే గుడిసెలు ఏర్పాటు చేసుకొన్న పేదప్రజలకు అన్యాయం జరగకుండా వారందరినీ ఒకేచోటకు చేర్చి వారికి పునరావాసం కల్పించాలని కమిటీ నిర్ణయించింది. పర్యటనలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు రాములు నాయక్, రామచంద్రరావు, కంటోన్మెంట్ వైస్ ఛైర్మన్ కేశవరెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి(మేడ్చెల్), ఎమ్మెల్యే కృష్ణారావు (కూకట్‌పల్లి), హెచ్‌ఎండీఏ ఎంఈ ఎస్.శ్రీనివాస్, సెక్రటరీ బాలాజీ రంజిత్ ప్రసాద్, ఇన్‌చార్జి సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.