
మంత్రి గారి కారు మోజు
ఆయన ముందు వాహనం కనబడితే చాలు చటుక్కున ఎక్కేసి ఓ రౌండ్ నడిపి చూస్తారు. గన్‌మెన్‌లు, కాన్వాయ్ గురించి పట్టించుకోరు. ఆయనే మన ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు. ‘అన్నా బుల్లెట్ కొన్నాను. నీచేత పూజ చేయించుకుంటా..’ అని ఎవరైనా వస్తే చాలు. పూజ అయ్యాక జస్ట్ స్టార్ట్ చేసినట్టే చేసి రయ్‌న వెళ్లిపోతారు. ఆయనను అనుసరించడం కోసం గన్‌మెన్‌లు అందిన బండ్లను దొరకపుచ్చుకుని వెనకాలే ఉరుకులు పరుగులు పెడుతారు. ఇలా ద్విచక్రవాహనాలేకాదు కార్లు.. జీపులు ఏవైనా సరే ఓ రౌండ్ వేస్తారు మన మంత్రిగారు. ఇటీవల చెత్త తరలింపు కోసం వచ్చిన హైడ్రాలిక్ ట్రాలీ ఆటోలను కూడా ఆయన వదల్లేదు.
కాలనీల్లో నడిపించి స్థానికులను అలరించారు. తాజాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథాలు వచ్చాయి. వాటిని పరిశీలించడానికని నివాసం ముందుకు వచ్చి మినిస్టర్స్ క్వార్టర్స్ అంతటా సదరు వాహనాలను నడిపి సరదా తీర్చుకున్నారు. -సికింద్రాబాద్