హైదరాబాద్‌లో అదృశ్యం.. గోవాలో ప్రత్యక్షం
శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైన ఇంటర్ విద్యార్థిని ఆచూకీ లభ్యమైంది. విశాఖపట్నం నుంచి పుణె బయల్దేరి, మధ్యలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించకుండా పోయిన కైరవి (17) గోవాలో ప్రత్యక్షమైంది. కైరవి అదృశ్యం అయినట్లు తెలియగానే ముందుగా విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజిని గమనించారు. అక్కడ ఆమె గోవాకు వెళ్లినట్లు తెలియడంతో ముందుగా గోవా ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందించారు. తర్వాత ఆమె ఫోన్ సిగ్నల్‌ను పరిశీలించి.. గోవా బీచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమె తండ్రి అరవింద్ శర్మకు ఆ విషయం చెప్పారు. ఆయన బయల్దేరి గోవా వెళ్లగా అక్కడ ఆయనకు అప్పగించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత గానీ ఆమె ఎందుకు గోవా వెళ్లిందో తెలియదు. కొంతమంది స్నేహితులతో వెళ్లినట్లు అనధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
విశాఖలో నేవీ ఆఫీసర్‌గా పనిచేసే అరవింద్ శర్మ కుమార్తె కైరవి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది. ఆమె గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి విమానంలో శంషాబాద్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి పుణేకు వెళ్లాల్సి ఉంది. అయితే పుణె వెళ్లలేదని తెలిసిన ఆమె తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు యువతి ఆచూకీ దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.