
నా గొంతు కోసేస్తారా?
♦ న్యాయస్థానం తీర్పును గౌరవించరా?
♦ రాజ్‌భవన్ వద్ద ఎమ్మెల్యే రోజా ఆవేదన
♦ నేరాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటారని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా సమస్యలపై తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నందుకు నా గొంతు కోసేస్తారా? శాసనసభకు స్పీకర్ సుప్రీం కాదనం.. అయితే, అందరూ కలిసి నన్ను ఉరితీయమంటే తీసేస్తారా?’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదనగా ప్రశ్నించారు. తనను ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై హైకోర్టు స్టే ఇచ్చినా అధికారపక్షం, స్పీకర్ అమలు చేయడానికి నిరాకరించడంతో ప్రతిపక్ష నేత జగన్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శాసనసభా వ్యవహారాల్లో తానేతప్పూ చేయలేదని, ప్రజా సమస్యలపైనా, మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులపైనా గళం విప్పడమే నేరమా? అని ప్రశ్నించారు.
తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేసి ఉత్తర్వులు పొందినా అసెంబ్లీకి రానీయకపోవడం అన్యాయమన్నారు. అధికారపక్షానికి న్యాయవ్యవస్థపై ఏ పాటి గౌరవం ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ చీఫ్ మార్షల్ ఒక భద్రతాధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సస్పెండ్ అయిన మరుసటి రోజు గత డిసెంబర్ 19న కూడా తనపట్ల దురుసుగా వ్యవహరించి ప్రాంగణంలోకి రాకుండా అనారోగ్యానికి గురవడానికి కారణమయ్యారన్నారు. తాను గురువారం సాయంత్రం 3 గంటలకే కోర్టు ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి శుక్రవారం నుంచి అసెంబ్లీకి వస్తానని పేర్కొన్నప్పటికీ శుక్రవారం రాకుండా అడ్డుకున్నారన్నారు. త నను లోనికి రానీయవద్దని స్పీకర్, కార్యదర్శి నుంచి ఆదేశాలున్నాయని చీఫ్ మార్షల్ చెబుతారేగానీ లిఖిత పూర్వకంగా ఉన్నాయా అంటే స్పందించరన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించని వారు తాను హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేసినపుడు వాదించడానికి అసెంబ్లీ తరపున న్యాయవాదులను ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై తాను మళ్లీ కోర్టుధిక్కరణ పిటిషన్ వేసి పోరాడతానన్నారు.
వీళ్లంతా అర్హులా!?
ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే తనను అసెంబ్లీలోకి రానివ్వరుగానీ, నేరాలకు పాల్పడిన వారిని పక్కన కూర్చోబెట్టుకుంటారా? అని చంద్రబాబును రోజా సూటిగా ప్రశ్నించారు. ‘బాధాకరమైన విషయమేమిటంటే ప్రజల గురించి మాట్లాడే నన్ను మాత్రం సభలోకి రానివ్వరు.. మహిళను కార్లోకి చెయ్యిపట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించిన రావెల సుశీల్‌కు పూర్తి మద్దతిచ్చిన తండ్రి రావెల కిశోర్‌బాబును మాత్రం మంత్రి పదవి నుంచి తొలగించరు. పక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టి లాగడమేకాక ఎస్‌ఐని, అటవీ అధికారిని కొట్టిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను చంద్రబాబు పక్కనే కూర్చోబెట్టుకుంటారు. కార్ రేసింగ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణానికి కారణమైన తన కుమారుడు బొండా సిద్ధార్థపై కేసు లేకుండా కాపాడినందుకు బొండా ఉమామహేశ్వరరావు మాత్రం న్యాయవ్యవస్థపై గౌరవం లేని విధంగా మాట్లాడతారు.
ఎమ్మెల్యేను కదా అనే అహంకారంతో వంగలపూడి అనిత ఓ టీచర్‌ను కొట్టినా తప్పులేదు. (దక్కన్ క్రానికల్‌లో వార్త వచ్చింది) పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఓటింగే పెట్టకుండా మూజువాణితో అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయిందని ప్రకటించుకుంటారు. కానీ నా విషయంలో మాత్రం అన్యాయంగా వ్యవహరిస్తున్నారు’ అని రోజా అన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మాత్రం చట్టసభల్లో ఉండటానికి అర్హులేనా? అని ప్రశ్నించారు. ‘సీఎం చంద్రబాబు, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటివారు ఎన్నిసార్లు సభలో అన్‌పార్లమెంటరీ పదజాలం వాడారో అందరికీ తెలుసు. కానీ స్పీకర్ వాటన్నింటినీ వింటారు, మేం వివరణ ఇవ్వబోతే మైక్ ఇవ్వరు’ అని రోజా మండిపడ్డారు.