
'పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం వహించాలి'
హైదరాబాద్: ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటించిన సినీనటుడు పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుపై తనకున్న నమ్మకాన్ని ప్రకటించారే తప్ప ఎక్కడా విమర్శించలేదని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. రైతుల నుంచి భూములిప్పించే విషయంలో ప్రభుత్వానికి, రైతులకు నడుమ పవన్ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ రైతుల తరపున మెరుగైన ప్యాకేజీ కోరితే సీఎం చంద్రబాబు వినేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన గ్రామాలన్నీ వైఎస్సార్ సీపీకి అనుకూలమని, అందువల్లే భూములను ఇవ్వడానికి అక్కడి వారు అంగీకరించడం లేదన్నారు. రాష్ట్రంలో జ్వరంతో మరణించిన వారికి పరిహారం ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. జ్వర మరణాలకు ప్రభుత్వ పర్యవేక్షణ లోపమని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మచిలీపట్నం కలెక్టరేట్‌ను ముట్టడిస్తాననడం.. భూ సేకరణకు వ్యతిరేకంగా ధర్నాకు దిగుతాననడం కరెక్ట్ కాదని, ఆయన ఆలోచన విరమించుకోవాలని అన్నారు.