‘మోడల్ కేసు’ సైబరాబాద్‌కు బదిలీ | model case transfer to saibarabad | Sakshi
Sakshi News home page

‘మోడల్ కేసు’ సైబరాబాద్‌కు బదిలీ

Published Fri, Jan 17 2014 2:08 AM | Last Updated on Fri, Sep 7 2018 1:59 PM

model case transfer to saibarabad

 సాక్షి, సిటీబ్యూరో:  ముంబైకి చెందిన మోడల్‌ను ‘న్యూ ఇయర్’ ఈవెంట్ పేరుతో నగరానికి తీసుకువచ్చి సామూహిక లైంగిక దాడి చేసిన ఉదంతానికి సంబంధించిన కేసును నగర నేర పరిశోధన విభాగం అధికారులు సైబరాబాద్‌కు బదిలీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి ఈ ఘాతుకం చోటు చేసుకోగా... జనవరి ఏడున ముంబైలోని వెర్సోవా ఠాణాలో కేసు నమోదైంది. సిటీకి బదిలీ కావడంతో తొమ్మిదిన సీసీఎస్ అధికారులు రీ-రిజిస్ట్రేషన్ చేశారు.

 ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను బట్టి ఉదంతం సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న నిజాంపేట్‌లో జరిగినట్లు నిర్థారించారు. అయితే అప్పటికే బాధితురాలు ముంబై పోలీసుల వద్ద కేసు నమోదు విషయంలో అష్టకష్టాలు పడటాన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఇక్కడకు వచ్చాకా పరిధుల పేరుతో మరోచోటుకి పంపితే ఆమె నైతిక స్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని భావించారు. దీంతో పరిధుల్ని పక్కన పెట్టి కేసును చాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేయాలంటూ సీసీఎస్ అధికారుల్ని ఆదేశించారు.

 అదనపు కమిషనర్ (నేరాలు) సందీప్ శాండిల్య, క్రైమ్స్ డీసీపీ జి.పాలరాజుల పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు రెండు రోజుల్లోనే నలుగురు నిందితుల్నీ కటకటాల్లోకి నెట్టారు. వీరి విచారణలో బాధితురాలి నుంచి దోచుకున్న సొత్తును పాతబస్తీలో విక్రయించారని గుర్తించి దాన్ని రికవరీ చేశారు. నిందితులు ఉపయోగించిన కార్లలో ఒకటి స్వాధీనం చేసుకున్నారు. కేసు కొలిక్కి రావడంతో భవిష్యత్తులో చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. దీంతో గురువారం కేసును కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు.

 ఈ కేసులో నిందితులుగా ఉన్న వెంకటరాజు, హ్యాపీ, అలీ, హరికృష్ణల్ని సీసీఎస్ అధికారులే అరెస్టు చేయగా... వీరి విచారణతో పాటు బాధితురాలి కథనంతోనూ మరో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీనిపై ఆరా తీసిన అధికారులు నిజాంపేట్‌కే చెందిన కారుడ్రైవర్‌ను ఐదో నిందితుడిగా గుర్తించారు. ముంబై నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బాధితురాల్ని తీసుకుని నిందితులు తొలుత వెంకటరాజుకు చెందిన కారులో బయలుదేరినా... మార్గ మధ్యంలో ఓ దుకాణం వద్ద రవి నడుపుతున్న కారులోకి మారారు.

 నిజాంపేట్‌లోని వెంకటరాజు ఇంట్లోకి వెళ్లిన తరవాత మత్తుమందిచ్చి ఐదుగురూ లైంగికదాడి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రవి కోసం గాలించిన అధికారులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఇతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తామని సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన ఓ అధికారి అన్నారు. వీలైనంత త్వరలో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement