ఇంట్లోనే పౌష్టికాహారం...
శిశువులను ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు..
మహిళలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
బంజారాహిల్స్: సరైన పౌష్టికాహారం లేక దేశంలో నిత్యం వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.. సమస్య తీవ్రతను గుర్తించిన ప్రపంచంలోని 185 దేశాలు ఈ సమస్యను అధిగమించేందుకు ఒక్కటయ్యాయి.. అందులో మన దేశం కూడా ఒకటి.. కానీ గణాంకాల లెక్కలు ఈ మరణాలను తగ్గించలేకపోతున్నాయి.. ఈ నేపథ్యంలోనే వచ్చే ఐదేళ్లలోనైనా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది.. ఇది ఇటీవల ఒక ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో సాక్షాత్తు ఎంపీ కవిత చెప్పిన మాటలివి..
అయితే పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు ప్రతి తల్లి ప్రయత్నం చేయవచ్చు.. ఇంట్లో లభించే నిత్యావసర సరుకులతోనే బిడ్డను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు పౌష్టికాహార నిపుణులు.. సామాన్యుల నుంచి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ఈ ఆహార పదార్థాలను తయారు చేసుకునే విధానం, తల్లి తన బిడ్డ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో అవగాహన కల్పించేందుకు బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని నందినగర్ సామాజిక భవనంలో నిర్వహించిన సమావేశంలో వివరించారు.సామాజిక ఆహార పోషణ విస్తరణశాఖ, ఆహారంపోషక విషయాల బోర్డు ప్రదర్శనాధికారి నటరాజశేఖర్, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్టు డెరైక్టర్ కెఆర్‌ఎస్ లక్ష్మీదేవి, ఐసీడీఎస్-2 ప్రాజెక్టు సీడీపీఓ కె.సత్యవతి ఈ చర్చాగోష్టిలో పాల్గొని గర్భిణులు, బాలింతలు, తల్లులు, పిల్లలకు పోషక విలువలున్న ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో, దాంతో ప్రయోజనాలు ఎంటో పలు సూచనలు జారీ చేశారు.
గోధుమపిండి, రాగులు, వేరుశనగ, బెల్లం, పప్పులు, గోధుమ రవ్వ ఇలా ఇంట్లో లభించే ఆహార పదార్థాలతో పోషక విలువలు లభించే ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ప్రత్యక్షంగా అక్కడికి వచ్చిన మహిళలకు చేసి చూపారు. ముఖ్యంగా కిచిడీ తయారీ ఎంత తేలికో చూపడమే కాకుండా అందులో లభించే పోషక విలువలను వివరించారు. బియ్యం, నెయ్యి, బెల్లం, పెసరపప్పుతో తయారుచేసే తీపి పొంగల్, రాగితో చంటిపిల్ల అనుబంధ ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు. జొన్నలతో చంటి పిల్లలకు ఇచ్చే ఆహారాన్ని తయారు చేసుకొనే విధానాన్ని, ఆ మిశ్రమాన్ని శుభ్రమైన పొడి డబ్బాలో ఎలా నిల్వ చేసుకోవచ్చో కళ్లకు కట్టారు. గోధుమలు, శనగపప్పు, పంచదారతో చంటిపిల్లలకు ఇచ్చే ఆహారాన్ని వివరించారు. వీటితోపాటు గోధుమ పాయసం, గోధుమ రవ్వతో కిచిడీ, రాగిలడ్డు, గోధుమ శనగపిండి లడ్డు తయారు చేసుకొనే విధానం, అందులోని పోషక విలువలను వివరించారు. ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ అవగాహన సదస్సు మూడు గంటలపాటు కొనసాగింది.
కళ్లకు కట్టినట్లు చెప్పారు
అధికారులు తయారుచేసి చూపించిన ఈ పదార్థాలు మేము ఇళ్లలో కూడా తేలికగా తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో కళ్లకు కట్టినట్లు తెలిపారు. నిత్యం మనం వాడుకొనే సరుకులే అయినా వాటిలో ఇన్ని రకాల పోషకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా పేదలైనా నిత్యం తమ ఇంట్లో దొరికే వస్తువులతోనే వీటిని తయారుచేసి బిడ్డను ఆరోగ్యంగా తీర్చిదిద్దవచ్చు.
- సరోజ, నందినగర్
ఇంట్లోనే తయారు చేసుకుంటా
పోషక విలువలతో కూడిన అదనపు ఆహారం ఇవ్వడంతో బిడ్డకు శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం లభిస్తుందని ఈ అవగాహన సదస్సులో తెలుసుకున్నాను. చక్కని మానసిక ఆరోగ్యంతో మేధోసంపత్తి పెరిగి పిల్లలు చక్కగా చదువుకోవడానికి దోహద పడుతుంది. నేను మా ఇంట్లో ఉన్న బియ్యం, గోధుమలు, పప్పులు, బెల్లం తదితర పదార్థాలు ఉపయోగించి అనుబంధ ఆహారాన్ని తయారు చేసి బిడ్డకు పెడతాను. - నవ్యశ్రీ, బంజారాహిల్స్
బస్తీ మహిళలకు వివరిస్తున్నాం
తల్లులకు పిల్లల పోషకాహార పద్ధతులపై సమాచారం, ప్రత్యక్ష సహకారం లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. సమాజంలోని తల్లికి ఆస్పత్రుల నుంచి ఇంటి వరకు సరైన పోషకాహార పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. పోషకాహారం లేకపోతే పిల్లలు మరణానికి గురవుతారు. సరైన పోషకాహార పద్ధతులను విశదీకరించేందుకు మేము పౌష్టికాహార నిపుణులతో బస్తీల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం.
- నటరాజశేఖర్,
పర్యవేక్షణాధికారి, ఆహారం, పోషక విషయాల బోర్డు
డాక్టర్ అమ్మ
Published Fri, Feb 20 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement